YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమ్మర్ లోనే లోకల్ ఎలక్షన్స్

సమ్మర్ లోనే లోకల్ ఎలక్షన్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 12, 
తెలంగాణలో స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది.అయినా ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రాలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ చెప్పడం తప్ప ఒక తేదిని మాత్రం ప్రకటించలేదు. అయితే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే సమయంలో అవసరమైన అధికారులకు శిక్షణ కూడా ఇస్తోంది. అయితే ప్రస్తుతం పదవతరగతి పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అంటోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రధానమైన పదవ తరగతి, ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు విద్యాభ్యాసంపై ప్రభావం పడుతుందని,  దీంతో వారు ఏకాగ్రత కోల్పోయి  తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నదని సంఘం నాయకులు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ముగిశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే గత ఐదేండ్లలో గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచ్‌లు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారుఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా వారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికలయ్యాక మాట మార్చడం సరికాదన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ వర్గీకరణలో తగు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందా? రేవంత్ సర్కార్ నిర్ణయంతో విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయా? సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో ఎలా చెయ్యాలనే ఆలోచనలో మిగతా పార్టీలు పడ్డాయా? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా అన్న ప్రశ్న బీఆర్ఎస్, బీజేపీలను వెంటాడుతోందా? తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పైకి చెబుతోందా? దీనిపై ఇంకా నిర్ణయం వెల్లడించకుండా బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తోంది?రేపో మాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకానుంది. దీనికి సంబంధించి ఒకొక్కటి క్లియర్ చేస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బీసీ డెడకేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. దీని తర్వాత సర్పంచ్, ఎంపీటీపీ, జెడ్పీటీసీలు ఎన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం ఓ అంచనాకు రానుంది.ఇక రాజకీయాల విషయానికొద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కులగణన సర్వే అసెంబ్లీ చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ పరంగా ఎన్నికల్లో 42 శాతం అమలు చేస్తామని కుండబద్దలు కొట్టేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా వస్తాయి. మిగతా 20శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార పార్టీల్లో చర్చ జరుగుతోంది.అధికార పార్టీ ఈ విధంగా చేస్తే.. మిగతా పార్టీలు కాంగ్రెస్ దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెడికేటెడ్ సిపార్సుల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు 22 శాతం రిజర్వేషన్లు అధికారంగా అమలు చేస్తూనే మిగతా 20శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఎంపీపీలు, జెడ్పీ ఛైర్మన్ ఎంపికలో దామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల మాట.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 శాతం కేటాయిస్తే.. మిగతా పార్టీలపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీనిపై ఇటు బీఆర్ఎస్, బీజేపీలో తేల్చుకోలేక పోతున్నాయి. ఇటీవల ఆయా పార్టీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీతోపాటు బీఆర్ఎస్ కూడా దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై గతంలో కేటీఆర్ ఓ మాట ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాము కూడా 42 శాతం కేటాయిస్తామని చెప్పేశారు. కానీ.. పార్టీలో పరిస్థితులు ఆ స్థాయిలో లేవని అంటున్నారు. అధికారం పోయిన తర్వాత కేడర్ చెల్లాచెదురైంది. కేడర్ బలహీనం కావడంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ల లేని పరిస్థితి కారు పార్టీ నేతలది.
ఇక బీజేపీ విషయానికొద్దాం.బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సైలెంట్ అయిపోయింది. సిటీ, పట్టణాల్లో ఆ పార్టీ కొంత కేడర్ ఉంది. రూరల్లో మరింత వీక్‌గా కనిపిస్తోంది. ఇటీవల భర్తీ చేసిన పార్టీ మండల అధ్యక్ష పదవులు బీసీలకు 50 శాతం కేటాయించామని బయటకు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఆ పార్టీ పడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 42 శాతం అమలు చేస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే నినాదం రావచ్చని అంటున్నారు. మరి బీసీలకు 42 శాతం అంశం బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Related Posts