
హైదరాబాద్, ఫిబ్రవరి 13,
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం జనం క్యూ కడుతున్నారు. మీ సేవ కేంద్రాల వద్దకు జనం బారులు తీరారు. గంటల తరబడి నిలబడి మరీ తమకు రేషన్ కార్డులు కావాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామసభలు జరిపినా అందులో కొందరికే రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నా వారి దరఖాస్తులు ఏమయిపోయాయో? కూడా తెలియదు. మరోసారి మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఒక్కసారిగా జనం పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి కొత్త దరఖాస్తుల కోసం లక్షలాది మంది ఎదురు చూపులు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రకంగా దరఖాస్తులను కోరలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తర్వాత రేషన్ కార్డులదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో తమకు తెలుపు రంగు రేషన్ కార్డులు కావాలంటూ ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులుంటే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ దక్కుతాయన్న భావనతో పాటు తమకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందుతుందని భావించి రేషన్ కార్డుల కోసం ఎగబడుతున్నారు.ఇక విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వంటి పథకం కూడా అందాలంటే తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం. అలాగే ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా ఈ కార్డు ముఖ్యం కావడంతో జనం దాని కోసం క్యూ కట్టారు. . మీ సేవా కేంద్రాలన్నీ హైదరాబాద్ లో కిటకిటలాడిపోతున్నాయి. మీ సేవా కేంద్రాల్లో వచ్చే వారిలో 90 శాతం రేషన్ కార్డుల కోసమే వస్తున్నారని చెబుతున్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో పాటు మార్చి నెల చివర వరకూ డెడ్ లైన్ విధించడంతో ఒక్కసారిగా జనం కార్డులు కావాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ఒకేసారి నాలుగు పథకాలను గ్రౌండ్ చేయడంతో అయితే ఎక్కువగా రేషన్ కార్డుల కోసమే అత్యధిక దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ వడపోసి అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డులు అందరికీ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో తెలుపు రంగు రేషన్ కార్డుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.