
ఏలూరు, ఫిబ్రవరి 15,
ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. వదంతులు వ్యాపించడంతో ధరలు పడిపోయాయి.ఏపీలో కోళ్ల పరిశ్రమకు అనువైన సీజన్‌లో వైరస్ బారిన పడి లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. వదంతుల్ని కట్టడి చేయడంలో పశు సంవర్థక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వ్యాధి నిర్ధారణ తర్వాత చేపట్టాల్సిన చర్యల విషయంలో తీరిగ్గా వ్యవహరించడంతో భారీగా డామేజ్ జరిగింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో అనుమానాలు తీర్చడంలో ఏపీ పశు సంవర్థకశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాంసం, గుడ్లు విక్రయాలు పడిపోయాయి.ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలలకు పైగా కోళ్లు అనూహ్యంగా చనిపోతున్నాయి. ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంపై పశు సంవర్థక శాఖ పెద్దగా పట్టించుకోలేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో కోళ్ల పెంపకానికి అనువుగా ఉంటుంది. కోడి పిల్లలు వేగంగా బరువు పెరుగుతాయి. 45-60 రోజుల్లో సిద్ధం అవుతాయి. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌లో గోదావరి జిల్లాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. తెగులు సోకిందని భావించి వాటిని పూడ్చేశారు.అప్పట్లో కోళ్ల మరణాలపై ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. మరోవైపు కొల్లేరు ప్రాంతానికి వలస పక్షులు వచ్చే సీజన్‌లో జరిగిన మరణాలను పెద్దగా పట్టించుకోలేదు.వలస పక్షుల వైరస్ జలాశయాల నుంచి నీళ్ల ద్వారా వ్యాప్తి చెంది ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వైరస్ వ్యాప్తి చెందింది. చివరకు ఫిబ్రవరి మొదటి వారానికి లక్షల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో పశు సంవర్ధక శాఖ సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం, సకాలంలో పౌల్ట్రీ పరిశ్రమను అప్రమత్తంగా చేయక పోవడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఏపీలో కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ వినియోగంతో ఎలాంటి నష్టం లేదని చెబుతున్నా జనంలో మాత్రం అనుమానాలు పెరిగిపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారానికి 20వేల టన్నులు బాయిలర్ మాంసం విక్రయాలు జరిగేవి. మరో 15వేల టన్నులు ఫారం కోళ్లను తినేవారు. ఫ్లూ ప్రభావంతో బ్రాయిలర్ కోళ్ల వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. ఫారం కోళ్లను కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఏలూరు జిల్లా బాదంపూడిలో బర్డ్ ఫ్లూ గుర్తించడంతో దాని ప్రభావం మొత్తం జిల్లాపై పడింది.ఏలూరు జిల్లాలో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ వదంతులు చెలరేగాయి. దీనిపై ఏలూరు కలెక్టర్ కె.వెట్రి సెల్వి స్పందించారు. అసత్యప్రచారాలను ఖండించారు. ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బర్ట్ సోకిన కోళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో ఖననం చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగ రాణి చెప్పారు. తణుకు రూరల్ మండలం వేల్పూరులో గురువారం నిర్వహించిన కోళ్ల ఖననం చేసే పనులను పరిశీలించారు.
బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన పనిలేదన్న అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు బోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ హైసెక్యురిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారన్నారు. కేంద్ర నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు.బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎటు వంటి భయం లేకుండా బాగా ఉడికించిన గ్రడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం వల్ల ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలు బయాందోళనలకు గురయ్యేలా బర్డ్ ప్లూ పై తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవారి పై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు మరియు కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని ఐదు ఫ్రౌల్ట్రీల్లో ఈ వ్యాది సోకినట్లుగా గుర్తించి ఆయా ప్రాంతాలను బయో సెక్యురిటీ జోన్లుగా ప్రకటించి, అధికారులను, సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరిగిందన్నారు.