
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. హైదరాబాద్ లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య గత కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ పై నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ఫెడరేషన్ ఆఫీస్ బేరర్లు,కార్యవర్గ సభ్యులు ఆయా అంశాలపై దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలతో పాటు తక్షణం పరిష్కరించాల్సిన పలు అంశాలపై పై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య గురువారం మీడియాకు విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీం, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు, చిన్న,మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు, జర్నలిస్టుల ప్రత్యేక రక్షణ చట్టం తదితర డిమాండ్ల పరిష్కారాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానించిందని తెలిపారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని అన్నారు. జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వకుండా జీవో 239 సమీక్ష, సవరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నదనీ,దీని వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని వాఖ్యానించారు.జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వానికి ఏడాదిగా సమయం ఉన్నా, ఇంత వరకు పరిష్కరించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
25 నుంచి సభ్యత్వ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25వ తేదీ వరకు నెల రోజుల పాటు ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సమావేశం తీర్మాణం చేసింది.అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతుందని, జర్నలిస్టులంతా ఐక్యత, హక్కుల సాధన కోసం ఫెడరేషన్ లో సభ్యులుగా చేరి భవిష్యత్తు కార్యాచరణలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల ఫెడరేషన్ మహాసభలు నిర్వహించాలని, మార్చి 29న రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరపాలని సమావేశం నిర్ణయించినట్లు వారు తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, బండి విజయ్ కుమార్, గుడిగ రఘు, కొప్పు నిరంజన్, విజయానంద్,కోశాధికారి రాచమల్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సలీమా, తన్నీరు శ్రీనివాస్, కర్రా అనిల్ రెడ్డి, ఈ. చంద్రశేఖర్, జగదీష్,రాజశేఖర్, మానిక్ప్రభు,నవీన్,కార్యవర్గ సభ్యులు మణిమాల, కె. పాండురంగారావు ,నాయిని శ్రీనివాస రావు పి నాగవాణి,పరిపూర్ణం, రమేష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.