
వాషింటోన్ ఫిబ్రవరి 20
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోకి టెస్లా ప్రవేశించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మస్క్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ.. ఇది అన్యాయమే అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో సమావేశమైన రోజుల వ్యవధిలోనే టెస్లా సంస్థ భారత్‌లో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో రెండు షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాగా, ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలోని ప్రతీ దేశం తమను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. సుంకాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారని.. ఆయన వరకు అది మంచి విషయమే కావొచ్చన్నారు. కానీ, అమెరికా పరంగా చూస్తే మస్క్ నిర్ణయం చాలా అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించారు. మస్క్ ముందే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక ఇదే ఇంటర్వ్యూలో గత వారం ప్రధాని మోదీతో భేటీ విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ మీటింగ్‌లో విద్యుత్ కార్లపై అధిక పన్నుల విషయాన్ని మోదీ తన వద్ద ప్రస్తావించినట్లు ట్రంప్ చెప్పారు. ట్యాక్సుల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఇరు దేశాలు కలిసి పని చేసేలా నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.