వైకాపా, బిజెపి, జనసేనపై ఆర్ధిక మంత్రి యనమల మండిపడ్డారు. మూడు పార్టీల విధ్వంస రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధానికి కన్నా లక్ష్మినారాయణ ఇచ్చిన వినతిలో ప్రత్యేక హోదాను ఎందుకని చేర్చలేదని అయన ప్రశ్నించారు. ప్రధానికి ఇచ్చిన వినతిలో కాపుల రిజర్వేషన్ గురించి ఎందుకని కన్నా పేర్కొనలేదు..? ఉద్దేశ పూర్వకంగానే ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లను కన్నా గాలికి వదిలేశారని యనమల అన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దానిని వెంటనే ఆమోదించాలని కన్నా ఎందుకని ప్రధానిని కోరలేదు..? ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లపై బిజెపి వైఖరిని కన్నా వినతి బైటపెట్టింది. మూడు పార్టీలు వైకాపా, బిజెపి, జనసేన వేర్పాటు విధానాలు అనుసరిస్తున్నాయని అయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయి. పోలవరం, అమరావతి రెండు సినిమాలని జగన్ అనడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తన అవివేకాన్ని జగన్ బైట పెట్టుకున్నారు. రాష్ట్ర సమస్యలపై కనీస అవగాహన జగన్ కు లేదని రుజువైంది. రెండు ప్రాజెక్టులను సిన్మాలని చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ కోరాలని అన్నారు. కుర్చీ మీద యావ తప్ప రాష్ట్ర సమస్యలు జగన్ కు పట్టవు. కేంద్రంలోని బిజెపి పెద్దలు రాష్ట్రాల ఖజానాలపై భారం పెంచుతున్నారు. రాష్ట్రాలను బలహీనపరిచి కేంద్రం బలపడాలని చూస్తోందని అన్నారు. రాష్ట్రాల ఖజానా ఖాళీ చేయించి కేంద్రం ఖజానా నింపాలని చూస్తున్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని అన్నారు. ఒంటెత్తు విధానాలను కేంద్రంలోని బిజెపి నేతలు మానుకోవాలి. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు చేయూత అందించాలని అన్నారు.