
హైదరాబాద్, ఫిబ్రవరి 25,
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్లతో రాష్ట్ర బీజేపీ ప్రతిష్టని మరింత మసకబారుస్తున్నారని ఆ పార్టీ వర్గాలు లబోదిబో మంటున్నాయి. రాజాసింగ్‌ను పార్టీ నుంచి తప్పించాలని చూస్తున్నారన్న అనుమానం వచ్చే లోపే ఆయన మరో బాంబ్ పేల్చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు రాజసింగ్ తనకి తానుగా దూరంగా ఉంటున్నారని అనుకునే లోపే ఆ బీజేపీ కార్యక్రమాలపై, రాష్ట్ర నాయకత్వ తీరుపై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటూ బతికేస్తా అంటూనే ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా వెళ్లి నా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటానని చెప్తూనే.. ఆ పార్టీ ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉలిక్కి పడతారన్నట్టు రాజా సింగ్ చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం తేలు కుట్టిన దొంగలా మిగిలిపోతుంది. ప్రతిసారి రాజాసింగ్ సంధిస్తున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పలేని రాష్ట్ర నేతలు రాజా సింగ్‌ను శత్రువులా చూస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. రాజాసింగ్ దూకుడుని అడ్డుకోలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం ఆయనకు పార్టీ పరంగా పూర్తిస్థాయిలో చెక్ పెట్టేయాలనే యోచనలో ఉందంట. ఆ క్రమంలో రాజాసింగ్ పార్టీలో ఉన్నా లేకున్న ఒకటే అన్న భావనలో రాష్ట్ర నాయకత్వం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ సంస్థాగతంగా జరుగుతున్న పార్టీ వ్యవహారాలపై కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని.. అందుకే ఆయనకున్న సోషల్ మీడియా ఎకౌంట్లు కూడా నిషేధించారంటున్నారు. తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించిందిరాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలను మెటా స్తంభింప చేసి, వారి పోస్టులను తొలగిస్తుంటుంది. ఫేస్‌బుక్ లో రాజాసింగ్ కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు, యూట్యూబ్‌లో 211 వీడియోలను మెటా తొలగించింది.అయితే తనను, తన హిందుత్వవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే పార్టీలో కొన్ని పెద్ద తలకాయలు తన సోషల్ మీడియా అకౌంట్లు రద్దు చేయించాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో రాజా సింగ్ వర్సెస్ పార్టీ నాయకత్వం మధ్య పంచాయితీ మరింత పీక్ స్టేజ్ కి చేరిందనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు పార్టీలో రాజాసింగ్ ను పక్కన పెట్టాలని చూస్తున్న ఆ పెద్ద తలకాయలు ఎవరనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై గత కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ చేస్తున్న తిరుగుబాటుకు ప్రజల్లోనూ మద్దతు పెరుగుతోంది. అంతేకాదు ఇటు పార్టీ వర్గాల్లోనూ మద్దతు పెరుగుతుండటంతో పార్టీలో ఇంకొందరు కూడా తిరుగుబాటుకు సిద్దమవుతున్నారా? అన్న చర్చ మొదలైందిరాజాసింగ్ పంచాయితీ పార్టీలో సంస్థాగతంగా రచ్చ రెపుతుంటే, మరోపక్క పార్టీ సంస్థగత ఎన్నికలు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో మరింత హీట్ పెంచుతున్నాయి. ఒకవైపు పార్టీలో రాజాసింగ్ పంచాయితీని చక్కబెట్టలా..? సంస్థగత ఎన్నికలపై ఫోకస్ పెట్టాలా..? అధ్యక్ష రేసులో కొత్త పాత నేతల మధ్య నడుస్తున్న వార్‌ను చల్లార్చలా..? లేక జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టాలా అనేదానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోందంట. అలా బీజేపీలో ఎవరి గోల వారిది అన్నట్లు తయారైతే.. బీజేపీలోకి వలస వచ్చి పదవుల్లో ఉన్న నేతలు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు.కొత్త నేతలు పదవులకు పనికిరారా, ప్రచారానికి మాత్రమే పనికొస్తారా..? ఎన్నికల్లో సర్వ శక్తులు ఒడ్డి గెలిచాక ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని, అయా నేతల వర్గాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు గెలిచామనే సంతృప్తి కన్నా పదవులకు అర్హులు కాదని నేతలు చేస్తున్న వాఖ్యలపై కొత్త నేతల అనుచరులు అసహనంతో కనిపిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడం తప్పు కాదని.. అయితే సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి బహిరంగంగా మాట్లాడమేంటని బీజేపీలో పుట్టి పెరిగిన నేతలపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఫైర్ అవుతున్నారు.తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, ఆయా జిల్లాల ఇన్చార్జి లు, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఒక్కొక్కరికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య పెరుగుతున్న విభేదాలపై అసహనం వ్యక్తం చేశారంట. ఎవరికి ఎవరూ బాస్‌లు కాదు.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. ఇదంతా చూస్తూ రాష్ట్ర కమల దళంలో జరుగుతున్న అంతర్గత, బహిరంగ కుమ్ములాటలకు అధిష్టానం ఇస్తున్న ట్రీట్మెంట్ లు ఏ మాత్రం సరిపోవడం లేదని కేడర్ పెదవి విరుస్తోంది. మరి ఎలాగైన రచ్చ గెలవాలని చూస్తున్న బీజేపీ ఇంటిని ఎప్పటికి చక్కపెట్టుకుంటుందో చూడాలి.