అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం. ఇది భావి నగరం. కొత్త నగరంలో తమకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం సీఆర్డీఏపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపారు. సాంకేతికతను మేళవించి ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సైబరాబాద్ నగరాన్ని జతచేసి, 165 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైదరాబాద్ నగర రూపురేఖలే మార్చాం. ప్రపంచంలో అత్యుత్తమ నగరాలను పరిశీలించామని సీఎం తెలిపారు. సింగపూర్, అమ్స్టర్డ్యామ్ నగరాలకు లేని ఫ్రెష్వాటర్ అమరావతి సొంతమని పేర్కొన్నారు. ఈ తరహా నిర్మాణం దేశంలో మరెక్కడా జరగలేదు. దేశంలో మిగిలిన కొత్తగా నిర్మించిన రాజధానులను పరిశీలిస్తే, చండీగఢ్ పరిపాలన నగరంగానే ఉండిపోయిందని అన్నారు. ఇక్కడి ప్రజానీకం డైనమిక్గా ఉంటారు. బుల్లెట్ రైలు తీసుకువద్దామనుకుంటే ఢిల్లీలో భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా ఉంది. అలాంటిది 35 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇక్కడికి వచ్చాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు చంద్రబాబు తెలియజేశారు. బాబు పిలుపుపై రియల్ఎస్టేట్ డెవలపర్లు స్పందిస్తూ భూములిచ్చి రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు ముందుకొస్తే అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.