YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎంపీకి చిక్కులు తెచ్చిన సచిన్

ఎంపీకి చిక్కులు తెచ్చిన సచిన్
మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురించి నెల్లూరు జిల్లాలో ఏమని చర్చ సాగుతోంది? రాబోయే ఎన్నికల్లో ఆయన ఎక్కడినుంచి పోటీచేసే అవకాశముంది? జిల్లాలో ఆయన దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? ఆయా గ్రామాల ప్రజానీకం ఆయనపై ఎందుకు గుర్రుగా ఉంది? ఈ అంశంపై వైకాపా కార్యకర్తలు ఏమంటున్నారు?
మేకపాటి రాజమోహన్‌రెడ్డి! వైకాపా ఎంపీ. అయిదుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవజ్ఞులు. గత తొమ్మిదేళ్లుగా నెల్లూరు ఎంపీగా ఉంటున్నప్పటికీ ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తిన సందర్భాలు చాలా తక్కువ. అంతెందుకు.. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించిన ఘటనలు కూడా తక్కువ. బిట్రగుంటలో రైల్వే పరిశ్రమ ఏర్పాటుచేయాలని ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. అయినా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మునుపు జరిగిన ఉపఎన్నికల్లో మూడు లక్షలకి పైగా మెజారిటీ సాధించుకున్న మేకపాటికి గత ఎన్నికల్లో కేవలం పదమూడు వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ అంశాన్ని కొందరు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మేకపాటి నెల్లూరు నుంచి పోటీచేయకపోవచ్చుననీ, నరసరావుపేటకి షిఫ్ట్‌ కావచ్చుననీ అంచనా వేస్తున్నారు.
         ఎంపీ మేకపాటి తీరుపై ప్రజలు పెదవి విరవడానికి కారణాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు తమ స్వస్థలానికి చేరువనే ఉన్న కంపసముద్రం, సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లె గ్రామాలని ఆయన దత్తత తీసుకున్నారు. మేకపాటి వాటిని దత్తత అయితే తీసుకున్నారు కానీ.. ఆ తర్వాత ఆ ఊసే మరచిపోయారు. కంపసముద్రంలో అన్ని గ్రామాల్లో మాదిరిగానే రోడ్లు వేశారు. మేకపాటి ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి చేసిందేమీ లేదు. మారంరెడ్డిపల్లె గ్రామాన్ని దత్తత తీసుకునే సందర్భంలోనే మేకపాటి ఇక్కడికి వచ్చారు. మళ్లీ ఆ ఊరి ముఖమే చూడలేదు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో మేకపాటి తమ గ్రామాలని దత్తత తీసుకోవడంతో స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేరపోవడంతో ఇప్పుడు గట్టిగానే దుయ్యబడుతున్నారు.
         మేకపాటిని అంతలా విమర్శిస్తున్నారని ఎవరైనా అడిగితే.. ఆ రెండు దత్తత గ్రామాల ప్రజలు అనేక విషయాలు వల్లిస్తున్నారట. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌నే తీసుకోండి. గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగని దత్తత తీసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఎన్నో పనులు చేపట్టారు. ప్రతి నెలా సచిన్‌ ఆ గ్రామంలో పనులపై ఆరా తీస్తారట. ఇంకా ఏమేమి చేయాలో తెలుసుకుంటారట. గ్రామంలో ఇంటింటికీ కుళాయి, కంపోస్ట్‌ యార్డ్‌, కమ్యూనిటీ హాలు, క్రికెట్‌ గ్రౌండ్‌, సిమెంట్‌ రోడ్లు, అంగన్‌వాడీ భవనం, చెరువులో చేపల పెంపకం.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ గ్రామానికి పక్కనే ఉన్న నెర్నూరుని కూడా దత్తత తీసుకుని అక్కడా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అదండీ దత్తత విషయంలో చిత్తశుద్ధి చూపడం అంటే.. అని ప్రజలు గడగడా వల్లిస్తున్నారట.
        ఏపీ ప్రోటోకాల్ అధికారి మద్దినేని అశోక్‌బాబుని కూడా జనం గుర్తుచేసుకుంటున్నారు. వరికుంటపాడు మండలంలోని గొల్లపల్లిని ఆయన దత్తత తీసుకున్నారు. ఆ ఊరిలో ముందుగా వాటర్‌ప్లాంట్ నెలకొల్పి తాగునీటి సమస్యని పరిష్కరించారు. గొల్లపల్లి, మహ్మదాపురం, నాయుడుపల్లె, పాపన్నగారిపల్లెల్లో పిల్లలందరూ స్కూల్‌కి వచ్చేలా చేశారు. గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. విద్యార్థుల కోసం ఆటో ఏర్పాటుచేశారు. ఇద్దరు వాలంటీర్లని నియమించారు. ఉచితంగా పుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అంతకుముందు ఇరవై మంది విద్యార్థులుంటే ఇప్పుడు నూట ఇరవైమంది అక్కడ చదువుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధిదీపాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం అశోక్‌బాబు తన కార్యకలాపాలని నాలుగు మండలాలకి విస్తరించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు ఇప్పించడం, జిల్లా అధికారులని గ్రామానికి తీసుకురావడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడీ గ్రామాల ప్రజలు తమకేమైనా సమస్య వస్తే ఆయనకే చెప్పుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యకి అశోక్‌బాబు దగ్గర బంధువు. ఉదయగిరి ప్రాంతంలోని పల్లెల్లో విద్య, తాగునీటి సమస్యలపై ప్రధానంగా ఆయన దృష్టి సారిస్తున్నారు. ఆయన చిత్తశుద్ధిని కూడా ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
ఎంపీ మేకపాటి తీరుపై వైసీపీ క్యాడర్‌ సైతం అసంతృప్తిగా ఉండటం గమనార్హం. ఆయన ఆ రెండు గ్రామాలను దత్తత తీసుకోకపోయినా బాగుండేది. తీసుకున్నాక శ్రద్ధ చూపించకపోవడం సబబు కాదు. ఒక పక్క సచిన్‌ టెండూల్కర్‌, మరోవక్క అశోక్‌బాబు తాము దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతున్నారు. మేకపాటి మాత్రం ఆ గ్రామాల సంగతే పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ప్రజలు విమర్శిస్తున్నారని వైకాపా నేతలు అంటున్నారు. కనీసం ఏదైనా ఒక ప్రధాన సమస్యని తీసుకుని.. దాన్ని పరిష్కరించి ఉంటే ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేవారు అని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా తాను దత్తత తీసుకున్న గ్రామాల విషయంలో మేకపాటి వారి వ్యవహారశైలి మాత్రం విమర్శనాత్మకంగానే ఉంది.

Related Posts