ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే ఒకనాడు ఉద్దండులకు మారుపేరు. పార్టీ ఏర్పాటుతోWనే రాజకీయ ఆరంగేట్రం చేసిన ముఖ్య నేతలెందరో ఉన్నారు. మూడున్నర దశాబ్దాలుగా తమదైన ముద్రవేశారు. జిల్లా రాజకీయాలను శాసించారు. కీలక సమయాల్లో రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. ఇలాంటి నేతలు వారి అవసరాల కోసమో లేదంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసమో పార్టీని వీడుతూ వచ్చారు. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుంచి నిష్క్రమించడంతో ఉద్దండులంతా ఆ పార్టీని వీడినట్లు అయ్యింది. ఈ పరిణామానికి కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఎందరో నేతలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ టీడీపీ సభ్యత్వం స్వీకరించారు. మోత్కుపల్లి నర్సింహులు, కుందూరు జానారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఆకారం సుదర్శన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, సంకినేని వెంకటేశ్వరరావు వంటి వారంతా టీడీపీతోనే బలమైన నేతలుగా అవతరించారు. వీరంతా దాదాపు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పలు సందర్భాల్లో జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు బలమైన జిల్లాగా ఉన్న నల్లగొండలో టీడీపీ జెండాను రెపరెపలాండించారు. బడుగు- బలహీనవర్గాల అండతో జిల్లాలో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించేందుకు దోహదపడ్డారు.
మూడు దశాబ్దాల కాలంలో జిల్లా అభివృద్ధిపైనా చెరగని ముద్రవేశారు. ఎన్‌టీఆర్ ప్రభుత్వంలోనూ.. అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలోనూ మంత్రులుగా పనిచేస్తూ.. కాంగ్రెస్ ఉద్దండులను ఎదుర్కొని పార్టీని నలుచెరగులా విస్తరింపచేశారు. ఎవరికీ వారే శక్తిమంతులుగా.. అందరూ కలిస్తే బలమైన పార్టీగా టీడీపీని రూపుదిద్దారు. ఇలాంటి నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరం కావడం విచిత్రమైన రాజకీయ పరిణామం. చివరివరకు ఉన్న మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇటీవలే టీడీపీ నుంచి బహిష్కృతులు కావడంతో కీలక నేతలు లేని టీడీపీగా నల్లగొండ జిల్లా పార్టీ మిగిలిపోయింది.
తెలుగుదేశం ఆరంభం నుంచి మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి మాధవరెడ్డి జిల్లాలో పార్టీ విస్తరణ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిద్దరి మధ్య నిరంతర వార్ కొనసాగినా.. పార్టీ అభివృద్ధికి మాత్రం పాటుపడుతూనే వచ్చారు. ఈ మధ్యలోనే కుందూరు జానారెడ్డి టీడీపీని వీడి ఒక పార్టీని పెట్టి అనంతరం కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత అత్యంత ప్రజాధారణ కలిగిన నేతగా పేరొందిన ఎలిమినేటి మాధవరెడ్డి హోంమంత్రిగా ఉండగా.. 2000 సంవత్సరం మార్చి నెలలో నక్సలైట్ల మందుపాతరకు బలైపోయారు. దీంతో ఒక బలమైన నేతను జిల్లా టీడీపీ కోల్పోయినట్టయ్యింది. ఆ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడన్నట్లుగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదిగివచ్చారు. గుత్తా సైతం అనతికాలంలోనే జిల్లాపై పట్టు సాధించగలిగారు. మాధవరెడ్డి సతీమణి ఉమామాధవరెడ్డి కూడా తన భర్త రాజకీయ వారసత్వాన్ని స్వీకరించి ముందుకు వచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాలో తన పట్టును పెంచుకున్నారు.
ఇదే క్రమంలో జిల్లా టీడీపీలో మరో పరిణామం కూడా చోటుచేసుకుంది. మోత్కుపల్లి నర్సింహులు, గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయులకు మధ్య తీవ్ర అగాధం కొనసాగుతూ వచ్చింది. ఈ సమయంలో మోత్కుపల్లి నర్సింహులు ఉమ మాధవరెడ్డిని ముందుపెట్టి.. గుత్తాకి చెక్‌పెట్టడంలో సఫలీకృతులయ్యారు. దీంతో 2009 ఎన్నికల సమయంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జిల్లాలో మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి వర్గీయులు పార్టీలో పట్టు కోసం నిరంతరం పోరాటం సాగించారు. ఒకవైపు పార్టీని కాపాడుకుంటూనే.. తమ వైరాన్ని కూడా కొనసాగించారు. ఇదిలా ఉంటే, పార్టీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి కీలక నేతగా ఉన్న ఆకారం సుదర్శన్ అందరితో సత్సంబంధాలు కొనసాగించేవారు. రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేసిన ఆకారం సుదర్శన్ అనారోగ్యానికి గురై మరణించారు.
దీంతో ఒక సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే కీలక నేతను టీడీపీ కోల్పోయింది. అనంతర కాలంలో పార్టీలో మోత్కుపల్లి నర్సింహులు వర్గీయుల పోరుని తట్టుకోలేక తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు కూడా తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరారు. ఇదే సమయంలో కోదాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వేనేపల్లి చందర్‌రావు కూడా 2014 ఎన్నికల తర్వాత పార్టీలో ముఖ్య నేతల పోకడలు నచ్చక టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ తదుపరి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇలా నల్లగొండ జిల్లా టీడీపీ నుంచి ముఖ్యనేతలు వెళ్లిపోతున్నా.. పార్టీ మాత్రం తన పట్టు కోల్పోలేదు. ద్వితీయశ్రేణి నాయకులు ఎదుగుతూ వచ్చారు. కానీ వీరు కూడా సీనియర్ నేతల మధ్య సాగే అంతర్గత యుద్ధాలలో నలిగిపోయారు. ఈ తరుణంలో వీరూ తమదారి తాము చూసుకోక తప్పలేదు. అలాంటి వారిలో గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్యానాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వ్యవహరించిన పటేల్ రమేష్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రేవంత్‌రెడ్డి టీడీపీని వీడినప్పుడు వీరు కూడా టీడీపీని వీటి కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్‌రెడ్డి అనుచరుడుగా ఉన్న నల్లగొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి మాత్రం టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో చివరకు సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డిలే నిన్నమొన్నటివరకూ జిల్లా టీడీపీలో మిగిలారు.
ఇటీవలే ఉమా మాధవరెడ్డి సైతం తన రాజకీయ భవిష్యత్తుతో పాటు తన కుమారుని భవిష్యత్తు కోసం టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీదండులో చేరిపోయారు. అందరూ పార్టీని వీడిపోయినా.. టీడీపీనే అంటిపెట్టుకుని ఉండిన మోత్కుపల్లి నర్సింహులు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు గవర్నర్ పదవి లేదా రాజ్యసభ సీటు ఇస్తారన్న ఆశతో ఆయన ఇన్నాళ్ళు వేచిచూశారు. కానీ ఆ ఆశ నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో ఒక్కసారిగా అధినేతపై విరుచుకుపడ్డారు. మోత్కుపల్లి నర్సింహులు తీరు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉందంటూ టీడీపీ హైకమాండ్ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. దీంతో నల్లగొండ టీడీపీలో ఆయన ప్రస్తానం కూడా ముగిసినట్లయ్యింది. వీరందరు తెలుగుదేశాన్ని వీడిపోయినా.. ఈ జిల్లాలో ఇంకా కొన్నిచోట్ల పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల స్థాయిల్లో నేతలు ఉన్నారు. వారు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర దారులు వెతుక్కుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఒకనాడు జిల్లాను శాసించిన నేతలతో కూడిన నల్లగొండ టీడీపీ నేడు పెద్దదిక్కు లేకుండా పోయింది. ద్వితీయశ్రేణి నాయకత్వమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతోంది.