
విజయవాడ, మార్చి 12,
ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీల్లో భాగమైన విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డిపిఆర్‌లో విజయవాడ నగరంలో ప్రతిపాదించిన అలైన్మెంట్ చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో సగం నగరాన్ని పూర్తిగా విస్మరించి తొలిదశ మార్గాన్ని ప్రతిపాదించడంతో దాని అసలు లక్ష్యం ఎంత మేరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది.విజయవాడ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలకు పదేళ్లు నిండి పోయాయి. ఢిల్లీ మెట్రో పాజెక్టుతో పాటు కొంకణ్ రైల్వే ప్రాజెక్టుల్ని తీర్చిదిద్దిన శ్రీధరన్ నేతృత్వంలో తొలిదశలో విజయవాడ మెట్రో చర్చలు నడిచాయి. ఆ తర్వాత విజయవాడ మెట్రో చర్చల నుంచి శ్రీధరన్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన రామకృష్ణా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.విజయవాడ మెట్రో ప్రాజెక్టు కసరత్తు మొదట్లో శరవేగంగా జరిగినా ఆ తర్వాత భూ సేకరణ సమస్యతో వెనకడుగు వేసింది. విజయవాడ నగరంలో మెట్రోకు అవసరమైన స్థల సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రధానమైన మహాత్మగాంధీ రోడ్డు, ఏలూరు రోడ్డులో విలువైన భూముల్ని మెట్రో నిర్మాణం కోసం వదులు కోవడంపై అభ్యంతరాలతో ప్రాజెక్టు ఆలస్యమైంది.విజయవాడకు మెట్రో బదులు లైట్ మెట్రోతో పాటు తక్కువ భూసేకరణ అవసం అయ్యే రకరకాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈలోపు ఐదేళ్లు గడిచి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసింది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం నుంచి విజయవాడ, విశాఖలకు మెట్రో ప్రాజెక్టులు రావాల్సి ఉన్నా వాటిని పట్టించుకోకుండానే మరో ఐదేళ్లు గడిచిపోయాయి. 2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే విజయవాడ మెట్రోలో కదలిక మొదలైంది.విజయవాడ మెట్రో తొలినాళ్ల నుంచి నగరంలో ఓ ప్రాంతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ డిపిఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ ప్రాంతాన్ని మెట్రో ప్రాజెక్టులో విస్మరించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతాన్ని విస్మరించి ఈ ప్రణాళికలు రూపొందించారు. విజయవాడ నగరంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలుపుకుని ప్రస్తుతం 15-20లక్షల జనాభా మాత్రమే ఉంది. నగరంలో ప్రధానమైన రెండు రోడ్లలో మాత్రమే మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు కిలో మీటర్ లోపు దూరంలో ఉన్న దుర్గగుడి, పాతబస్తీ కాళేశ్వరరావు మార్కెట్, విజయవాడ రైల్వే స్టేషన్ పశ్చిమ భాగం వంటి వాటిని మెట్రో ప్రాజెక్టులో భాగం చేయలేదు.పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి మొదలై అక్కడే ముగిసే రెండు కారిడార్లలో ఎంత మంది ప్రయాణిస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రస్తుతం ఐదు మార్గాలు ఉన్నాయి. పశ్చిమం వైపు రెండు టెర్మినళ్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు కిలో మీటర్ ప్రయాణించే మెట్రో ఎక్కే బదులు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లి పోతారు.నగరానికి పశ్చిమం వైపున ఉన్న పాతబస్తీ, భవానీ పురం, గొల్లపూడి, ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో పట్టణీకరణ పదేళ్లలో గణనీయంగా పెరిగింది. నగర జనాభాలో సగం మంది పశ్చిమ ప్రాంతంలో నివసిస్తారు. తాజా డిపిఆర్‌లో విజయవాడ పశ్చిమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. విజయవాడలో ప్రధానంగా ఉపాధినిచ్చే రంగాల్లో ఆటో మొబైల్ రంగంతో పాటు సేవా రంగం ప్రధానమైనవి. ఈ క్రమంలో నిత్యం పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం పశ్చి ప్రాంతం నుంచి తూర్పు వైపు ప్రయాణిస్తారు. ప్రస్తుత డిజైన్‌తో వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు.బస్టాండ్ కూడలిగా మెట్రో కారిడార్లు మొదలైతే కాలేజీ విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి పెద్దగా దానితో ఉపయోగం ఉండదు. విస్తృత ప్రయోజనాలు, ప్రజా రవాణా లక్ష్యాలను విస్మరించి కారిడార్లను డిజైన్ చేశారనే విమర్శలు ఉన్నాయి. తొలి దశలోనే ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా కనెక్టివిటీ కల్పించడంలో విఫలం అయ్యారు.
విజయవాడ-అమరావతి మెట్రో రైల్ డీపీఆర్‌కు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-1 లో కారిడార్ 1ఎ, 1బిగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 38.4 కి.మీ మేర నిర్మిస్తారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు మొత్తం రూ.11,009 కోట్ల వ్యయం అంచనా వేసింది ప్రభుత్వం. భూసేకరణకు రూ.1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా మెట్రో రైల్ కార్పొరేషన్ డీపీఆర్ సిద్ధం చేసింది. విజయవాడ మెట్రో ఫేజ్-2 మూడో కారిడార్‌ను దాదాపు 27.75 కి.మీల మేర నిర్మించనున్నారు.విజయవాడ మెట్రో కారిడార్ 1ఎ లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వరకు, కారిడార్ 1బిలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు, మూడో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మూడు కారిడార్లలో సగం విజయవాడ నగరాన్ని పూర్తిగా వదిలేశారు. పాతబస్తీతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో ఉన్న నివాస ప్రాంతాలకు మెట్రోలో భాగస్వామ్యం కల్పించలేదు.