ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. దేశంలోనే ఓ చారిత్రక ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని కితాబిచ్చారు. తెలంగాణకు ఇది గొప్ప ప్రాజెక్టు అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేంద్ర జలసంఘం హైడ్రాలజి డైరెక్టర్ ఎన్‌ఎన్ రాయ్, సీఈ సీకేఎల్ దాస్‌తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎన్ రాయ్ మాట్లాడుతూ.. దేశంలోనే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని కితాబిచ్చారు. ఈ ప్రాజెక్టు పనులు అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు సంబంధించి ఏ సమస్యా లేదని రాయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. సీకేఎల్ దాస్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణాలు, పనులు సాగుతున్న తీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఇది విభిన్నమైన ప్రాజెక్టు అని తెలిపారు. మే లేదా జూన్ నెలలో ప్రాజెక్టు తొలి ఫలాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఏ ఇతర ప్రాజెక్టులోనూ ఇటువంటి పనులు చూడలేదని తెలిపారు. నిర్దిష్ట గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేయడం నేడు సవాలుగా మారిందని సీకేఎల్ దాస్ అన్నారు. అంచనా వ్యయం మించకుండా పనులు పూర్తి చేయడమే ప్రధాన సవాల్ అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు చూస్తుంటే సమస్యను సలువుగా అధిగమిస్తారనిపిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మిగతా అనుమతులు పరిశీలనలో ఉన్నాయని దాస్ చెప్పారు.