YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సాగర్ నిండితే సరి..లేదంటే బోర్లే శరణ్యం

 సాగర్ నిండితే సరి..లేదంటే బోర్లే శరణ్యం
సకాలంలో వానలు కురుస్తున్నాయి. వర్షపాతం ఆశించినంతగానే ఉండడంతో రైతుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. ఈ దఫా సాగునీటికి పెద్దగా ఇబ్బందులు ఉండవనే అంతా భావిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధి రైతుల్లో మాత్రం కొంత నిరాశే నెలకొంది. సాగర్‌ జలాశయం నిండుతుందన్న నమ్మకం లేదని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్లుగా సాగర్ లో పూర్తిస్థాయిలో నీరు లేని పరిస్థితి ఉంటోంది. ఈ అనుభవంతోనే పలువురు బోర్లు వేయించుకోవడం ప్రారంభించారు. కాల్వ నీటిపైనే ఆధార పడిన చివరి ప్రాంతాల్లోనూ ఈసారి బోర్లనే ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఒకవేళ సాగర్‌ జలాశయం నిండి కాల్వల ద్వారా నీటి విడుదల జరిగితే.. ఫర్వాలేదు. లేనిపక్షంలో బోర్లే ఆధారమని కర్షకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో బోరు వాహనాలు సందడి నెలకొంది. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో నిత్యం వందల బోర్లు వేస్తున్నారు. 
 
కొన్నేళ్లుగా సాగర్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండని పరిస్థితి. దీంతోసాగునీటి కోసం ఆయకట్టులోనూ బోర్లు వేస్తున్నారు రైతులు. సాగర్ నీరు అందని పక్షంలో బోర్ల ద్వారా నీటిని అందించి పంటలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈసారి కూడా చివరి ప్రాంతాల్లోనూ నాలుగేళ్ల కిందటి పరిస్థితులే కనిపిస్తున్నాయని స్థానిక రైతాంగం అంటోంది. అయితే అప్పటికి..ఇప్పటికి కొంత భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఎలాగైనా సాగునీరు కావాలన్న ఉద్దేశంతోబోర్లు వేశారు. నేడు భూగర్భంలో నీరు ఉంటోందని బోర్లు వేస్తున్నారు రైతులు. భవిష్యత్తులో సాగర్‌ నీరు రాకున్నా.. బోర్లతో సాగు చేయవచ్చన్న నమ్మకం రైతుల్లో నెలకొంది. ఆయకట్టు చివరి ప్రాంతమైన మేళ్లచెరువు పరిధిలోనూ ఈ మధ్య బోరు వాహనాల హంగామా నడుస్తోంది. ఈ ప్రాంతంలోనే రోజుకు ఒక్కో వాహనం పది బోర్లపైనే వేస్తోందని స్థానికులు అంటున్నారు. ఒక్క మండలంలోనే వ్యవసాయ బోర్లు దాదాపు రోజుకు ముప్పై వరకు వేస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా సాగునీరు కోసం స్థానిక రైతాంగం ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి సాగర్ ఆయకట్టు పరిధిలో కనిపిస్తోంది.

Related Posts