YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశం కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతోందా..

దేశం కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతోందా..

న్యూఢిల్లీ, మార్చి 13 
దేశం కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతోందా.. దేశంలో గాలి నాణ్యత వేగంగా పడిపోతుందా అంటే పర్యావరణ నివేదికలు అదే చెబుతున్నాయి. రోజు రోజుకూ దేశంలో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. గాలి నాణ్యత పడిపతోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు 20 ఉండగా, అందులో 13 దేశాలు భారత్‌లోనే ఉండడం గమనార్హం.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌ ఒక ప్రముఖ స్థానంలో ఉంది. 2024లో స్విస్‌ ఎయిర్‌ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ IQAir విడుదల చేసిన ‘వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌‘ ప్రకారం, ప్రపంచంలోని టాప్‌ 20 కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనివే ఉన్నాయి. ఈ జాబితాలో మేఘాలయలోని బైర్నీహట్‌  అగ్రస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా గుర్తింపు పొందింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లోని 13 కాలుష్య నగరాలు
బైర్నీహట్‌(మేఘాలయ) అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా రికార్డు సష్టించింది.
ముల్లన్‌పూర్‌ (పంజాబ్‌)
ఫరీదాబాద్‌ (హర్యానా)
లోనీ(ఉత్తరప్రదేశ్‌)
న్యూఢిల్లీ
గురుగ్రామ్‌(హర్యానా)
గంగానగర్‌(రాజస్థాన్‌)
గ్రేటర్‌ నోయిడా(ఉత్తరప్రదేశ్‌)
భివాడీ(రాజస్థాన్‌)
ముజఫ్ఫర్‌నగర్‌(ఉత్తరప్రదేశ్‌)
హనుమాన్‌గఢ్‌ (రాజస్థాన్‌)
నోయిడా (ఉత్తరప్రదేశ్‌)
ఈ రిపోర్ట్‌లో కాలుష్య స్థాయిలను PM2.5 (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5) ఆధారంగా కొలుస్తారు. PM2.5 అనేది 2.5 మైక్రోమీటర్ల కంటే చిన్న కణాలను సూచిస్తుంది, ఇవి ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోయి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. భారత్‌లో సగటు PM2.5 స్థాయి 2024లో 50.6 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌గా నమోదైంది, ఇది 2023లో 54.4తో పోలిస్తే 7% తగ్గినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ  సిఫార్సు చేసిన సురక్షిత స్థాయి (5 మైక్రోగ్రామ్స్‌) కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఢిల్లీలో సగటు PM2.5 స్థాయి 91.6 మైక్రోగ్రామ్స్‌గా ఉంది. ఇది WHO సురక్షిత పరిమితి కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ.
కాలుష్యానికి కారణాలు..
భారత్‌లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలు:
వాహన ఉద్గారాలు: ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో ట్రాఫిక్‌ సాంద్రత వల్ల ఎక్కువ కాలుష్యం.
పారిశ్రామిక కాలుష్యం: ఫరీదాబాద్, భివాడీ వంటి ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు.
పంటల అవశేషాల దహనం: పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో స్టబుల్‌ బర్నింగ్‌ వల్ల ఉత్తర భారతదేశంలో కాలుష్యం పెరుగుతోంది.
నిర్మాణ ధూళి: వేగంగా అభివద్ధి చెందుతున్న నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు.
వాతావరణం: శీతాకాలంలో ఉష్ణోగ్రత తలక్రిందులు కావడం వల్ల కాలుష్య కణాలు గాలిలో చిక్కుకుంటాయి.
ఆరోగ్య ప్రభావం
భారత్‌లో వాయు కాలుష్యం ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా మారింది. ఇది సగటు జీవిత కాలాన్ని 5.2 సంవత్సరాలు తగ్గిస్తుందని అంచనా. లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ అధ్యయనం ప్రకారం, 2009–2019 మధ్య ఏటా సుమారు 15 లక్షల మరణాలు PM2.5 కాలుష్యంతో సంబంధం కలిగి ఉన్నాయి.ప్రపంచంలోని టాప్‌ 20 కాలుష్య నగరాల్లో 13 భారత్‌లో ఉండటం ఆందోళనకరం. ఢిల్లీ వంటి రాజధాని నగరం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంటే, బైర్నీహట్‌ వంటి చిన్న పట్టణాలు కూడా ఈ జాబితాలో చేరడం వాయు కాలుష్య సమస్య విస్తృతిని చూపిస్తోంది. ప్రభుత్వం ’నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌’ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ, కఠిన నియంత్రణలు, ప్రజల సహకారం లేకుండా ఈ సమస్యను అధిగమించడం కష్టం. వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Related Posts