YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందరికీ మెరుగైన వైద్యం

అందరికీ మెరుగైన వైద్యం
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తూ సమర్ధవంతమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లావాసులకూ మంచి వైద్య సేవలు లభించనున్నాయి. 
సూర్యాపేట వైద్య కళాశాల నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే రూ.470 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో కళాశాలలకు కావాల్సిన మానవ వనరుల ఎంపికను చేపట్టే ప్రక్రియ డీఎంఈ ప్రకటన సైతం విడుదల చేసింది. ఒక్కో కళాశాలలో 952 మంది వైద్య ఉద్యోగులతోపాటు 237 మంది ఇతర సిబ్బందిని తీసుకునేందుకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్ణయాలను త్వరితగతిన తీసుకుంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లా కేంద్రాసుపత్రితోపాటు సూర్యాపేట ఏరియా ఆసుపత్రులను వైద్యవిద్య సంచాలకుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన దస్త్రాన్ని రాష్ట్ర వైద్య శాఖ రెడీ చేసింది. జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్య కళాశాలకు అసవరమైన 560 పడకలు ఉండడంతో ఇక్కడ అభ్యంతరాలు లేవు. దీంతో  వైద్య విద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఎంపికతోపాటు ఉద్యోగుల ఎంపిక వారం రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 
మరోవైపు 2019 విద్యా సంవత్సరంలో అధికారులు 150 వైద్య విద్యార్థుల ఎంపిక కూడా ప్రారంభించనున్నారు. ఈ నెల 15 నుంచి వైద్య విద్య సంచాలకుల ఆధీనంలోకి జిల్లా ఆసుపత్రిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, జిల్లా కేంద్రాసుపత్రి కార్యకలాపాలు మిర్యాలగూడ నుంచి కొనసాగుతాయి. ప్రస్తుతం కేంద్ర ఆసుపత్రిలో పని చేస్తేన్న సీనియర్‌ వైద్యులు పది మంది వరకు ఇతర ఆసుపత్రులకు వెళ్లనున్నారు. దీంతోపాటు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో పడకల స్థాయిని పెంచడం, కళాశాలకు అవసరమైన అనుమతులు నిర్మాణాలు ఒకే సారి చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి స్థలం సైతం కొనుగోలు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తైతే ప్రస్తుతం రోగులకు అందుతున్న వైద్య సేవల కంటే ఐదింతల వైద్యం ఇక్కడే అందుతుందని అధికారులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. వైద్య కళాశాలలో సూపర్‌ స్పెషాలిటీ వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రజలందరినీ సమర్ధవంతమైన వైద్యం లభిస్తుందని స్పష్టంచేస్తున్నారు.

Related Posts