పిల్లలను మంచి విద్యావంతులుగానే కాక క్రీడాకారులుగానూ తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ మేరకు క్రీడా పాఠాశాలలు ఏర్పాటు చేసి చిన్నతనం నుంచే పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునే చర్యలు తీసుకుంటోంది. మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఈ స్కూళ్లు నాలుగోతరగతి నుంచే విద్యార్ధులకు వివిధ క్రీడల్లో శిక్షణ అందిస్తున్నాయి. ఈ బడుల్లో క్రీడలకే కాక బోధనకూ అధిక ప్రాధాన్యతనిస్తారు. క్రీడలు, విద్య..రెండు విభాగాల్లోనూ పిల్లలు రాణించేలా అధ్యాపకులు కృషి చేస్తుంటారు. ఈ క్రీడా పాఠశాలల్లో గత సంవత్సరం మూడో తరగతి పూర్తి చేసుకుని, ప్రస్తుతం నాలుగో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. బాలురకు 20, బాలికలకు 20 చొప్పున ఒక్కో పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకే ప్రవేశ అవకాశం ఉంది. ఈ పాఠశాలలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రంలో మూడు స్థాయిల్లో ఎంపికలు నిర్వహిస్తారు. ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ప్రస్తుతం నాలుగో తరగతిలో చేరి 01.09.2009 నుంచి 31.08.2010 మధ్య పుట్టిన వారై ఉండాలని అధికారులు తెలిపారు.
మండల స్థాయిలో స్థానిక ఎంఈవోలు, వ్యాయామ ఉపాధ్యాయుల సహాయంతో పోటీలు నిర్వహించి క్రీడా పాఠశాలలకు బాలబాలికలను ఎంపిక చేస్తారు. ఇక జిల్లా స్థాయిలో జిల్లా యువజన, క్రీడా శాఖాధికారి ఆధ్వరంలోనూ మొత్తంగా 40 మంది విద్యార్ధులను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఆయా క్రీడా పాఠశాల బాధ్యులు ఎంపిక నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. మండల స్థాయిలో జూన్ 14న. జిల్లా స్థాయిలో 21 నుంచి 25 వరకు, రాష్ట్ర స్థాయిలో 28 నుంచి జులై 7 వరకు పోటీలు నిర్వహిస్తారు. పోటీల్లో ఎంపికైన విద్యార్థులకు జులై చివరి వారంలోపు ప్రవేశాలు పూర్తిచేస్తారు. ఈ పాఠశాలలు క్రీడలపై ఆసక్తి ఉన్న బాలబాలికలకు ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. క్రీడల్లో ఉత్సాహం ఉన్నా స్థానికంగా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు మండల, జిల్లా స్థాయిల్లోనే నిలిచిపోతున్నారని అలాంటివారికి ఈ పాఠశాలలు తోడ్పాటునిస్తాయని వివరించారు. ఇదిలాఉంటే క్రీడా పాఠశాలల్లో అలా ఉత్సాహం ఉన్న విద్యార్థులకు చిన్నతనం నుంచే సరైన సౌకర్యాలు కల్పిస్తూ క్రీడల్లో నైపుణ్యం పెంపొందేలా శిక్షణ అందుతుంది. పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు క్రీడలు, చదువుతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. వారి ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్యకు అవకాశం కల్పించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కడానికి, అందులో రాణించడానికి అవకాశం ఉంటుంది.