
విజయవాడ, మార్చి 13,
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ఇటు సినీ రంగంలోనే కాదు.. అటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది. జైలులో అడుగుపెట్టినప్పటి నుండి పోసాని అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఫైనల్‌గా జడ్జి ముందు ఆయనను హాజరు పరిచారు పోలీసులు. గుంటూరు జిల్లాలోని జడ్జి ముందు ఆయన హాజరు పరిచిన సమయంలో పోసాని బోరున విలపించారు. తన అనారోగ్య పరిస్థితి గురించి జడ్జితో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ మంజూరు అయ్యేలా చేయమని, ఈ పరిస్థితుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు పోసాని కృష్ణమురళి. అసలు ఇదంతా ఎలా జరిగిందో వివరించారు.తనపై ఉన్న వ్యక్తిగత కోపంతోనే ఇలా తనపై ఫిర్యాదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధిపై ఆరోపణలు చేశారు పోసాని కృష్ణమురళి. ఇక తన ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్తూ.. ప్రస్తుతం తన ఆరోగ్యం అస్సలు బాలేదని, రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని జడ్జితో వివరించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న తర్వాత పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. దీంతో వెంటనే పోలీసులు.. పోసాని కృష్ణ మురళిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అలా మరోసారి కోర్టులో పోసానికి ఎదురుదెబ్బే తగిలింది. అనారోగ్య సమస్యలను కారణంగా చూపిస్తే బెయిల్ మంజూరు అవుతున్న పోసాని మరో 14 రోజల పాటు గుంటూరు జిల్లా జైలులో ఉండక తప్పదని తెలుస్తోంది.పోసాని కృష్ణ మురళి తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలా పోసానికి అనుకూలంగా ఏ తీర్పూ రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పోసాని కృష్ణ మురళిపై కేసులు నమోదయ్యాయి. అయినా దాదాపు అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో అంతా ఓకే అని, బుధవారం పోసాని రిలీజ్ ఖాయమని కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా నమ్మారు. కానీ వారందరితో పాటు పోసానికి కూడా గుంటూరు కోర్టు ఝలక్ ఇచ్చింది. మళ్లీ తనను రిమాండ్‌కే తరలించింది.ఒకవేళ గుంటూరు కోర్టు నుండి పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు అయినా.. మరో పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌పై పోసానిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పోసాని.. ఇంకా ఎంతకాలం ఈ జైలు జీవితాన్ని గడుపుతారో క్లారిటీ లేదు. ఒక దగ్గర బెయిల్ మంజూరు అయినా మరొక దగ్గర ఆయన కోసం పోలీసులు ఎదురుచూస్తూనే ఉంటారు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఆయనకు కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి బుధవారం గుంటూరు కోర్టులో హాజరయినప్పుడు ఆయనకు ఎలాగైనా బెయిల్ మంజూరు చేయమని కంటతడి పెట్టుకున్నారు పోసాని. అయినా ఆయనపై సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదు.