
హైదరాబాద్, మార్చి 15,
బీజేపీ తెలంగాణ అధ్యక్షుని నియామకం మరింత ఆలస్యమయ్యే లా ఉంది. ముందుగా పార్టీ నేతలు పేర్కొన్న ప్రకారం ఈనెల రెండో వారంలోపు నియామకం చేపట్టాల్సి ఉంది. అయితే ఎవరిని నియమించాలనే అంశం అధిష్ఠానానికి తలనొప్పి వ్యవహారంగా మారిందని తెలుస్తోంది.గతంలో ఎప్పుడు లేనంత పోటీ నెలకొన్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పైర వీలు, ప్రయత్నాలు భారీగా పెరిగాయ ని తెలుస్తోంది. అందుకే ఎవరిని అధ్యక్షున్ని చేయాలనే అంశంపై పార్టీ పెద్ద లు సమాలోచనలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని నియమిస్తా రని ప్రచారం కొనసాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో బీసీవాదంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికపై పార్టీపెద్దలు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో పెద్దగా సత్తా చాటలేకపోయిన బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 8 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది.తాజాగా జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కూడా కోల్పోగా, బీజేపీ ఏకంగా రెండు సీట్లు సాధించి సత్తా చాటింది. ఇక బీఆర్‌ఎస్ కనీసం పోటీ కూడా చేయలేకపోయింది. గెలుపు గుర్రం లాంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి సీటు అంటే ఎంత పోటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పీఠంపై కన్నేసిన నేతలు.. ఢిల్లీలోని పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.దీనికి తోడు కీలకమైన రాష్ట్రంలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదనే విషయంలో పార్టీ అధిష్ఠానం సైతం రొటీన్‌గా కొందరిపైనే ఆధారపడకుండా వివిధ మార్గాల ద్వారా నివేదికలు తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతోందని అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.