
హైదరాబాద్
భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మనమా వ్యవస్థలను నడుపుతున్నాం. 2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అయన శాసనసభలో మాట్లాడారు. మహిళా గవర్నర్ ను అవమానించేలా వ్యవహరించారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవస్థలను సంస్థలను గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నాం . సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేసినమని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారు. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారు. మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ తమ ప్రసంగంలో వినిపించారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం. మేం అమలు చేసే వాటినే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచాం. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే… గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉండదు. పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా? వాళ్లకు గవర్నర్ పై గౌరవం లేకనే మహిళను అవమానించారు. ఇది ప్రజా ప్రభుత్వం.. మేం రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను గౌరవిస్తాం. సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటాం. వారి సూచనలు తీసుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారు… అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయి. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. రైతులకు రూ.20624 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఎన్నికలను అడ్డు పెట్టుకుని ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే. మేం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ. 7625 కోట్లు రైతు బంధు రైతుల ఖాతాల్లో వేసింది మా ప్రభుత్వమని అన్నారు.
రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది. భూమిలేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 12 వేలు అందిస్తున్నాం.రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఆనాటి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయలేదు.వరి వేస్తే ఊరే అని మాట్లాడారు. కానీ మేం ధాన్యం కొనుగోలు చేసి రూ.1206 కోట్లు సన్న వడ్లకు బోనస్ అందించాం. కాళేశ్వరం లేకుండానే రైతులు 1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. పోరాటాలు చేశామని చెప్పుకునే వారు ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది వాళ్లు కాదా? మేం అధికారంలోకి రాగానే కేంద్రంను కలిసి నీళ్ల కోసం కొట్లాడాం. వైస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కెసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా. తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టుకుంది వీళ్లు కాదా . ఆనాడు వీళ్లు సహకరించకపోతే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదయ్యేదా అని అన్నారు.
కెసిఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాలను రెండు టీఎంసీ ల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి… నీళ్లను శ్రీశైలంకి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ఎస్ఎల్బీసీని నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సింది పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేసింది నిజం కాదా. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకు కారణం మీరు కాదా. కృష్ణా పరివాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారు. 15 నెలల్లో కెసిఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కెసిఆర్. ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ కష్టాలు తీరేది కదా. కెసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదాం. లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెపదానికి సిద్ధం. ఈ సవాలుకు కెసీఆర్ సిద్ధమా చెప్పాలన అన్నారు.
రోజుకు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కెసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే… విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కెసిఆర్… రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారని అన్నారు.