YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బంగారం ధర పెరుగుతుందా... తగ్గుతుందా...

బంగారం ధర పెరుగుతుందా... తగ్గుతుందా...

ముంబై, మార్చి 17, 
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న రెండు, మూడు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ఇంత ధర ఉంటే పెళ్లిళ్ల సమయంలో ఎలా కొనాలంటూ తలలు పట్టుకుంటున్నారు. భారతీయ సంప్రదాయంలో బంగారు ఆభరణాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. ముఖ్యంగా పెళ్లిళ్లలో వధూవరులకు బంగారు ఆభరణాలను కచ్చితంగా అలంకరిస్తారు. పెళ్లి కూతురికి అయితే ఎక్కువ మొత్తంగా బంగారు ఆభరణాలు అవసరం. కానీ, ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తుంటే.. పెళ్లి పెట్టుకున్న వారి గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,000కు మించిపోయింది.అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 3,000 డాలర్లను తాకింది. ఇంత భారీగా పెరిగినా.. త్వరలోనే ధరలు తగ్గుతాయనే ఆశ ఉండేది. కానీ, ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ధర ఇప్పట్లో తగ్గదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది. రోజురోజుకూ ధర పెరగడం చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వధూవరుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధర పెరిగి కొనేవాళ్లు కరవయ్యారని, ఆభరణాల వర్తకులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం వరకూ ధర ఇంకా పెరగకపోవచ్చని నిపుణులు అంచనా వేశారు. కానీ డొనాల్డ్‌ ట్రంప్, అమెరిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్‌లు పెంచడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి.కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఎంతో భద్రమైన ఆస్తిగా భావించే బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ధర పెరిగింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా ఔన్సు బంగారం ధర 1,000 డాలర్లకు చేరింది. నాలుగేళ్ల క్రితం కొవిడ్‌ ముప్పు ముంచుకొచ్చినప్పుడు 2,000 డాలర్లు పలికింది. మళ్లీ ఇప్పుడు 3,000 డాలర్లకు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు బంగారం ధర రికార్డు స్థాయికి చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు గత కొంతకాలంగా వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నాయి. 2022 నుంచి ఏటా 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కేంద్ర బ్యాంకులే కొనుగోలు చేశాయి. ఇందులో భారత రిజర్వు బ్యాంకు ముందుంటోంది. చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిని అక్కడి మదుపర్లు ఇటీవల పసిడిని ఎక్కువగా కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,000 డాలర్ల దగ్గర ఎన్నాళ్లు ఉంటుంది, ఇంకా పెరుగుతుందా, లేక తగ్గుతుందా? అనేది మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది.వర్తకులు, పెట్టుబడి నిపుణులు ఎవరూ దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అమెరికా టారిఫ్‌లు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర ప్రతికూల పరిస్థితులు కొనసాగినంత కాలం ధర తగ్గదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధర భారీగా పెరగడంతో ఆభరణాల వ్యాపారం తగ్గింది. బంగారు ఆభరణాల అమ్మకాలు 70 శాతం తగ్గినట్లు సమాచారం. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవడం పెరిగిందని, ఎంతో తప్పనిసరి అయితే తప్పించి కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర తగ్గే సూచనలైతే కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు.

Related Posts