YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ సభ నుంచి ఇక టీఆర్ఎస్సే

వరంగల్ సభ నుంచి ఇక టీఆర్ఎస్సే

వరంగల్, మార్చి 17, 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పేరును మార్చేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమయినట్లు తెలిసింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన చేయనున్నారని సమాచారం. వరంగల్ లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27వ తేదీన రజతోత్సవ వేడుకలు వరంగల్ వేదికగా జరగనున్నాయి. ఈ సభకు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. ఈ సభలోనే బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ గా మారుతుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్లు తెలిసింది. నేతల డిమాండ్ కూడా అదే కావడంతో దీనికి ఇక తిరుగుండదని భావిస్తున్నారు. ఇరవై ఐదో ఏట అడుగు... 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నాటికి ఇరవై ఐదో ఏట అడుగుపెడుతుంది. ఈ ఇరవై ఐదేళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 2001 నుంచి 2014 వరకూ అనేక ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని చట్ట సభల్లో చోటు దక్కించుకున్న నాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ రాజకీయ పోరాటంతోనే సాధ్యమని కేసీఆర్ బలంగా నమ్మారు. రాజకీయ పోరాటాలతో పాటు లాబీయింగ్ అవసరమని భావించి ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లో బలంగా నింపగలిగారు. అలా దాదాపు పదమూడేళ్ల పోరాటంలో కేసీఆర్ రక్తం చిందించకుండా రాష్ట్రాన్నిసాధించగలిగారు. ఇదే సమయంలో తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందించడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో అందరి నోట ఏకైక నినాదం ప్రత్యేక రాష్ట్రం. ఈ నినాదాన్ని అందుకుని కేసీఆర్ ఆమరణదీక్ష చేయడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇలా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా వచ్చినా తర్వాత జనం గుండెల్లో గూడుకట్టుకున్న సెంటిమెంట్ తో 2014, 2018 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. అయితే రెండు సార్లు అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఫోకస్ జాతీయ రాజకీయాలపై పడింది. ఆయన ఢిల్లీని శాసించాలనుకున్నారు 2023 ఎన్నికలకు ముందు... అదే రాష్ట్రంలో పార్టీ పాలిట శాపంగా మారిందంటారు. 2023 ఎన్నికలకు ముందు అంటే 2022 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలని, మహారాష్ట్ర,ఒడిశా, ఏపీలలో సీట్లు సాధించాలనుకున్న గులాబీ బాస్ కు 2023 ఎన్నికల్లో ప్రజలు ఝలక్ ఇచ్చారు. దీంతో నేతలు కూడా ఎక్కువ మంది టీఆర్ఎస్ ను ఇంటి పార్టీగా భావించారని, బీఆర్ఎస్ వల్లనే ఓటమి చెందామని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో జరిగే బహిరంగ సభలో తిరిగి బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Related Posts