
హైదరాబాద్, మార్చి 17,
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హర్షసాయి వీడియోను పోస్టు చేస్తూ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కారణంగా యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు అయింది. సైబరాబాద్ పోలీసులు... హర్షసాయిపై కేసు నమోదు చేశారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాను ప్రమోట్ చేయకపోతే వేరేవాళ్లు చేస్తారని, ఎందుకు ఆ డబ్బు పోగొట్టుకోవడం...ఆ డబ్బును పేద ప్రజలకు పంచుతున్నానని హర్షసాయి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. హర్షసాయిపై మండిపడ్డారు.బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్... యువత బెట్టింగ్‌ల బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని, ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తు్న్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా #సే నో టూ బెట్టింగ్ యాప్స్ క్యాంపెయిన్ స్టార్ చేశారు. ఎంతో మంది అమాయకులు బెట్టింగ్ భూతం వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారని సజ్జనార్ గుర్తుచేశారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదన్నారు.యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమజాహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి" అని సజ్జనార్ ట్వీట్ చేశారు."యూట్యూబర్ హర్ష సాయిపై కేసు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేను కొంత మంది వ్యక్తులను మాత్రమే వ్యతిరేకించడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల వ్యవస్థతో పోరాడుతున్నాను. వారికి లక్షలాది మంది అనుచరులు ఉన్నా లేదా కొన్ని వేల మంది ఉన్నా, ఈ విధ్వంసక ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేసే ఎవరైనా ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.వీటి వల్ల నిజమైన ప్రమాదం ఆర్థిక నష్టానికి మించి ఉంది. ఇది మన దేశ భవిష్యత్తును క్రమంగా క్షీణింపజేస్తోంది. భారతీయ ప్రతిభ ప్రపంచ సంస్థలకు నాయకత్వం వహిస్తుండగా, చాలా మంది యువ జీవితాలు వారి సొంత దేశస్థుల చేతుల్లో చిక్కుకుపోయి పట్టాలు తప్పుతున్నాయి. ఈ యాప్‌లు కేవలం వ్యక్తిగత ప్రమాదం కాదు, అవి సామాజిక, ఆర్థిక ముప్పు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇక ఆలస్యం కాకముందే, అవి కలిగించే నష్టాన్ని గుర్తించండి"- వీసీ సజ్జనార్.