
హైదరాబాద్ మార్చి 17
మనం శారీరకంగా, మానసికంగా శ్రమిస్తే అలసటగా అనిపిస్తుంది. దీని కారణంగా నిద్ర వస్తుంది. నిస్సత్తుగా కూడా అనిపిస్తుంది. బాగా అలసట చెందితే నీరసం, ఆయాసం వస్తాయి. దీంతో శరీరం సహజంగానే విశ్రాంతి కోరుతుంది. అయితే ఎలాంటి శారీరక లేదా మానసిక శ్రమ చేయకపోయినా కొందరికి అలసటగా, నీరసంగా ఉంటుంది. ఇలాంటి వారికి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే ఈ విధంగా అనిపిస్తుంది. దీంతో ఏ పని చేయాలనిపించదు. అలాగే కాస్త పని చేసినా కూడా విపరీతంగా అలసట వస్తుంది. ఏమాత్రం శక్తి లేనట్లు ఫీలవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే.. పోషకాహార లోపాన్ని ఇందుకు కారణంగా చెప్పవచ్చు. రోజూ సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పలు పోషకాలు లోపించడం వల్ల కూడా నిరంతరాయంగా అలసట, నీరసం కనిపిస్తాయి.
ఉదయం తినకపోవడం..
కొందరు ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోరు. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం అసలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రోజులో మనకు కావల్సిన ముఖ్యమైన పోషకాలను అందించే ఆహారాన్ని ఉదయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు శక్తిని, పోషకాలను రెండింటిని అందిస్తుంది. కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే శరీరంలో త్వరగా శక్తి నిల్వలు ఖర్చవుతాయి. దీంతో రోజంతా నీరసంగా ఉంటారు. చిన్న పని చేసినా అలసట విపరీతంగా వస్తుంది. కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు. కచ్చితంగా ఏదో ఒక ఆహారం తినాలి.
అతిగా ఉపవాసం ఉండడం..
మధ్యాహ్నం చేసే భోజనం కాస్త ఎక్కువ తిన్నా ఫర్వాలేదు. మధ్యాహ్న భోజనంలో శక్తి, చురుకుదనం కోసం కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం కొవ్వులను తక్కువగా తినాలి. అలాగే మనం యాక్టివ్‌గా ఉండాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా రోజూ తగినంత నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీళ్లను సరిగ్గా తాగితే జీవక్రియలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించబడతాయి. దీంతో శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తుంది. మనకు శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట అనేవి ఉండవు. అలాగే వారంలో 1 రోజు ఉపవాసం చేయవచ్చు. కానీ మితిమీరిన ఉపవాసం మొదటికే మోసం వచ్చేలా చేస్తుంది. అతిగా ఉపవాసం చేయకూడదు.
ఐరన్ లోపించడం..
శరీరంలో తగినంత ఐరన్ లేకపోయినా కూడా నీరసం, అలసట విపరీతంగా ఉంటాయి. ఐరన్ తగ్గితే కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా లభించవు. దీంతో సహజంగానే ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది నీరసం, అలసటను కలగజేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఐరన్ లోపం ఉందేమో చెక్ చేయించుకోవాలి. ఐరన్ లోపం ఉంటే డాక్టర్లు ఇచ్చిన మందులను వాడడంతోపాటు ఐరన్ ఉండే ఆహారాలను తినాలి. దీంతో నీరసం, అలసటకు చెక్ పెట్టవచ్చు. అలాగే ప్రోటీన్ల లోపం ఉన్నా, విటమిన్ సి లోపించినా కూడా చాలా మందికి అలసట, నీరసం వస్తుంటాయి. కనుక డాక్టర్‌ను కలిసి సరైన కారణాన్ని శోధించాలి. దీంతో సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా ఈ రెండు సమస్యలు ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు.