
ముంబై, మార్చి 20,
జీవితంలో ఒక్కసారి అయినా విమానం ఎక్కాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కానీ విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా మందికి అందనంత దూరంలో ఉంటుంది. మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎయిర్ లైన్స్ కంపెనీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇందుకోసం చాలా కంపెనీలు పలు రకాల వ్యూహాలను రచిస్తూనే ఉన్నాయి. సంపన్న దేశాల మాదరి భారత్ లో ఎయిర్ లైన్స్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఈ దశాబ్ధం చివరి నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు భారత విమానయాన రంగం కూడా గత పదేళ్ల కాలంలో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారత్ అవతరించింది. పదేళ్ల కిందట 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది.పదేళ్ల కిందట భారత్ దాదాపుగా ఎనిమిది మిలియన్ల సీట్లతో 5వ డొమెస్టిక్ ఎయిర్ లైన్ మార్కెట్‌గా ఉండేది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉండేవి. అమెరికా, చైనాలు వరుసగా తొలి రెండుస్థానాలను ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా అవతరించింది.బ్రెజిల్, ఇండోనేషియాలను దాటి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంలో మూడో స్థానానికి చేరినట్లు సంబంధిత శాఖ చేరుకుంది.
ప్రస్తుత విమానయాన మార్కెట్లో దేశీయ ఎయిర్ లైన్స్ సంస్థలు ఎంతెంత వాటా కలిగి ఉన్నాయో చూద్దాం.ఇండిగో 65.2శాతం, ఎయిర్ ఇండియా 25.7శాతం, అకాసా ఎయిర్ 4.7శాతం, స్పైస్ జెట్ 3.2శాతం, అలియన్స్ ఎయిర్ లైన్స్ 0.6శాతం, స్టార్ ఎయిర్ 0.4శాతం, ఫ్లై 91 0.1శాతం, ఇతర కంపెనీలు 0.1శాతంగా ఉన్నాయి.గత పదేళ్లో ఇండిగో దాని మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకుంది. 2014లో 32 శాతం కెపాసిటీ నుంచి నేడు అది 62శాతానికి పెరిగింది. మిగిలిన మార్కెట్ కేవలం 0.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది. అయితే ఇండిగోలో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని వెల్లడించింది. గతేడాది నవంబర్ 19న ఒక్కరోజులోనే భారత్‌లో విమానయాన సంస్థలు 4,56,910 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్. గత పదేళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగింది.