కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ పరంపరను కొనసాగిస్తుండటం బీజేపీనేతలకు మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా? అని ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా? లేక బీజేపీపై వ్యతిరేకత మరింత పెరుగుతోందా? అన్నది కమలం పార్టీ తేల్చుకోలేకపోతుంది. కన్నడ నాట అతి పెద్ద పార్టీగా అవతరించామన్న వారి ఆనందం రెండు ఎన్నికలతో ఆవిరైపోయింది.ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 103 స్థానాలను దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో నిలిచింది. ముఖ్యమంత్రిగా తొలుత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వెనక్కు తగ్గారు. తనకు బలం లేదని తెలుసుకుని బలనిరూపణ జరగకముందే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 78 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్, 37 స్థానాలను గెలుచుకున్న జనతాదళ్ ఎస్ లు కలసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ అధినేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసింది కాంగ్రెస్.కన్నడనాట ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయనే చెప్పాలి. రాజరాజేశ్వరి నగర్ కు జరిగిన ఎన్నికలోనూ, తాజాగా జరిగిన జయనగర్ ఎన్నికలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. దీంతో కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే ఆదరిస్తున్నారని చెప్పుకోవడానికి మంచి ఛాన్సు దొరికింది హస్తం పార్టీకి. వాస్తవానికి 103 స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈ రెండు స్థానాలూ దక్కి ఉంటే ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పుకోవడానికి కమలనాధులకు ఉండేది. కాని కాంగ్రెస్ మరో రెండు స్థానాలను దక్కించుకుని తన బలాన్ని 80కి పెంచుకుంది.ఇక బీజేపీ విషయాన్ని పక్కనపెడితే కుమారస్వామిని కట్టడి చేసేందుకు కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయంటున్నారు. రాజరాజేశ్వరి నగర్ లో జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచినా…త్రిముఖ పోటీలో కాంగ్రెస్ నెగ్గింది. జయనగర్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి జేడీఎస్ మద్దతిచ్చింది. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలయిందంటున్నారు. సచివాలయంలో అవినీతి బాగా ఉందని, దానిని అంతం చేయడానికి బదిలీలు ఒక్కటే మార్గమని, అవినీతిని అంతమొందిస్తానని ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత, మొన్నటి దాకా ముఖ్యమంత్రి గా ఉన్న సిద్ధరామయ్యకు సూటిగా తగిలాయి. గత పాలనలో అవినీతి ఉందని కుమారస్వామి చెప్పకనే చెప్పారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. అందుకే సిద్ధూ కూడా ఎదురుదాడికి సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల గెలుపుతో కుమారస్వామిని కూడా కట్టడి చేయవచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ కు వరుస విజయాలు మంచి ఊపును తెస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.