టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఈ మధ్య రాజకీయంగా కాస్త మౌనంగా ఉంటున్నారు. టీడీపీని వదిలి, వైసీపీలో చేరబోతున్నట్టు కూడా కథనాలు గుప్పుమన్నాయి. కానీ, వాటిని ఆయన ఖండించలేదు. అంతేకాదు.. పార్టీ కార్యక్రమాలకు కూడా ఈ మధ్య దూరంగా ఉంటున్నారు. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మినీ మహానాడు కార్యక్రమంలో పార్టీపైనా, కొంతమంది నేతలపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు ఇన్ ఛార్జ్ గా ఉంటూ, ఆ జిల్లాలో జరిగిన మినీ మహానాడుకి కూడా ఆయన హాజరు కాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకింత గందరగోళమే నెలకొంది. అయినాసరే, పార్టీ మార్పుపై మౌనంగానే ఉంటూ వచ్చారు.గుర్తింపూ గౌరవం లేని చోట పనిచెయ్యలేనని ఆనం చెప్పారు. గతంలో ఎన్నో పదవులు చేపట్టాననీ, తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించాననీ, కానీ ప్రాధాన్యత దక్కని చోట స్తబ్దుగా ఉండటం తనకు ఇష్టం ఉండదని ఆయన అన్నారు. పార్టీ మార్పుపై విలేకరులు ప్రశ్నిస్తే.. తనకు జిల్లావ్యాప్తంగా సన్నిహితులూ, అభిమానులూ ఉన్నారనీ వారందరితో చర్చిస్తానని అన్నారు. వారి ఇష్టప్రకారమే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఉంటుందని ఆనం స్పష్టం చేశారు.వైసీపీ వైపు చూస్తున్నారంటూ నిన్నమొన్నటి వరకూ ఊహాగానాలు వినిపిస్తే.. తాజాగా ఆయన కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలకు ఆయన ఈ మధ్య కలుసుకున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మరోసారి బలోపేతం కావాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పార్టీ వ్యహారాల కొత్త ఇన్ ఛార్జ్ గా ఉమెన్ చాందీ కూడా నియమితులయ్యారు. గతంలో పార్టీ వీడి వెళ్లిపోయినవారిని తిరిగి ఆహ్వానిస్తామని కూడా ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనం కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఏపీ కాంగ్రెస్ కి బలమైన నేతల కొరత చాలా ఉంది కదా! కాబట్టి, ఇలాంటి అసంతృప్త నేతల్ని ఆకర్షించే ప్రయత్నం వారికి అనివార్యం. ఏదేమైనా, ఆయన టీడీపీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు