మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మ్యాంగో, సపోట దెబ్బ తగులుతోంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య చేపట్టిన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మహారాష్ట్రలోని మామిడి, సపోట పండిస్తున్న రైతులు అడ్డుపడుతున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోని మామిడి, సపోట పంటలు సాగవుతున్న భూములను కేంద్ర ప్రభుత్వం సేకరించాలని చూస్తోంది. అయితే తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించకుండా భూ సేకరణ చేయడానికి వీళ్లేదని, హామీ ఇవ్వకుంటే భూములు ఇచ్చేదేలేదని పండ్ల రైతులు తెగేసి చెబుతున్నారు. వీరికి స్థానిక నేతలు అండగా నిలుస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రైతుల వ్యతిరేకతతో ఇది సకాలంలో అయ్యేలా కనిపించడంలేదు. దీని వల్ల ప్రాజెక్టు కూడా ఆలస్యం కాక తప్పదు. జపాన్ సాయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు విలువ 17 బిలియన్ డాలర్లు. అయితే మహారాష్ట్రలోని మామిడి, సపోట తోటలు ఉన్న ప్రాంతంలో 108 కిలోమీటర్ల మేర భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇది మొత్తం బుల్లెట్ రైలు కారిడార్‌లో ఐదోవంతు. వాస్తవానికి మార్కెట్ ధర కంటే 25 శాతం అధిక ధరకు రైతుల నుంచి భూమిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అదనంగా రూ. 5 లక్షలు లేదంటే భూమి విలువలో 50 శాతాన్ని చెల్లించాలని కూడా నిర్ణయం తీసుకుంది. కానీ రైతులు ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి చూపించడంలేదు. మామిడి, సపోట సాగే తమకు జీవనాధారం అని, కాబట్టి తమకు మరో ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ డెడ్‌లైన్ లోపల ప్రభుత్వం భూ సేకరణ చేయలేకపోతే ఆ ప్రభావం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచే వచ్చే నిధులు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండియన్ రైల్వే సీనియర్ అధికారులు రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే ఈ నెలలో టోక్యోలో సమావేశం ఏర్పాటుచేయాల్సిందిగా భారత అధికారులు జపాన్ రవాణా శాఖను కోరినట్లు తెలుస్తోంది. కాగా, 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది