
న్యూఢిల్లీ, మార్చి 27,
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ ఇదివరకే ఎలన్ మస్క్, టెస్లా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు, యూరప్‌కు చెందిన మరో రెండు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు బీఎండబ్ల్యూ , ఫోక్స్‌వ్యాగన్ కూడా అమ్మకాల విషయంలో టెస్లాను వెనక్కి నెట్టాయి. టెస్లాకు చైనా, అమెరికా తర్వాత యూరప్ అతిపెద్ద మార్కెట్. కానీ ఇక్కడ కూడా చైనాకు చెందిన బీవైడీ.. టెస్లాకు గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా, యూరప్‌కు చెందిన ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ గ్రూప్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు యూరోపియన్ మార్కెట్‌లో గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం టెస్లా అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది.యూరోపియన్ మార్కెట్‌లో ఫిబ్రవరి నెల టెస్లాకు అంతలా కలిసి రాలేదు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, జాటో డైనమిక్స్ అనే రీసెర్చ్ ప్లాట్ ఫామ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఫిబ్రవరిలో యూరప్‌లో టెస్లా అమ్మకాలు భారీగా పడిపోయాయి. యూరోపియన్ యూనియన్‌లోని 25 దేశాలు, బ్రిటన్, నార్వే, స్విట్జర్లాండ్‌లను కలిపి యూరోపియన్ మార్కెట్‌లో ఫిబ్రవరిలో టెస్లా అమ్మకాలు 44 శాతం తగ్గాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాటా కూడా 9.6శాతానికి పడిపోయింది. ఈ నెలలో కంపెనీ కేవలం 16వేల యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించగలిగింది. గత ఐదేళ్లలో ఫిబ్రవరి నెలలో ఇదే అత్యల్ప మార్కెట్ వాటా ఇదే కావడం గమనార్హం.సమయంలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 180శాతం మేర పెరిగాయి. కంపెనీ మొత్తం 20వేల కార్లను విక్రయించింది. మరోవైపు బీఎండబ్ల్యూ, దాని అనుబంధ సంస్థ మినీ బ్రాండ్ కలిపి ఫిబ్రవరిలో 19వేల యూనిట్ల కార్లను విక్రయించాయి. యూరప్‌లో చైనా ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. బీవైడీ అమ్మకాలు 94 శాతం పెరిగి 4వేల యూనిట్లకు చేరుకోగా, పోల్‌స్టార్ అమ్మకాలు 84 శాతం పెరిగి 2వేల యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఎక్స్‌పెంగ్ వెయ్యి కార్లను, లీప్‌మోటర్ 900 కార్లను విక్రయించాయి. విశేషం ఏమిటంటే.. చైనాకు చెందిన అన్ని కంపెనీల మొత్తం అమ్మకాలు టెస్లా కంటే ఎక్కువగా ఉన్నాయి.కార్ల అమ్మకాల పరంగా చూస్తే 2024లో టెస్లా 17.7 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. అదే సమయంలో బీవైడీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 17.6 లక్షలుగా ఉన్నాయి. ఇందులో బీవైడీ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు కూడా కలిపితే ఆ సంఖ్య 42.5 లక్షలకు చేరుకుంటుంది.