
హైదరాబాద్, మార్చి 27,
కేసులు.. బెయిల్‌లు.. కోర్టులు.. పిటీషన్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరినీ కదిలించినా ఇవే మాటలు. పార్టీ అగ్రనాయకులైన కేసీఆర్, కేటీఆర్ అరెస్టు తప్పదని కాంగ్రెస్ నేతలతో పాటు ప్రభుత్వంలోని పెద్దలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై బయటికి వచ్చారు. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేల అరెస్టు, ఆస్తుల జప్తుపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు అయింది. నేడో రేపో ఆయన ఆస్తులను అటాచ్ చేసుకునే అవకాశం ఉందట. ఇప్పటికే షకీల్ పరారీలో ఉన్నారు. సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారని 2024 ఫిబ్రవరి లో ఆయనపై కోటగిరి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ జరగకముందే షకీల్ దుబాయికి చెక్కేశారు. ఆ తరువాత అతడి కొడుకు రాహేల్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు కాగా, కేసును తారుమారు చేసేందుకు యత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసు విచారణ జరుగుతుండగానే రాహేల్ కూడా గల్ఫ్ పరారయ్యాడు.ఆర్మూర్‌కి ప్రాతినిధ్యం వహించిన మరో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి జైలుకు వెళ్లకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూ ఆక్రమణకు సంబంధించిన కేసులో జీవన్ రెడ్డి తల్లి రాజుబాయి, భార్య రజితకు హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని జీవన్ రెడ్డి ఆక్రమించారని కేసు పెట్టారు. తాను నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారని, తనను ఆయుధాలతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డికి చెందిన జీవన్ మాల్‌ను సైతం అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బకాయిలు పడి, చెల్లించడం లేదని విద్యుత్ తదితర శాఖల అధికారులు చర్యలకు ఉపక్రమించారు.ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు అక్రమ దందాలకు పాల్పడటం తీవ్ర విమర్శల పాలవుతోంది. గత ప్రభుత్వ హయంలో ఏం చేసినా నడుస్తుందిలే అన్నట్లు కొందరు నాయకులు వ్యవహరించారు. ఉన్న పదవి కోల్పోయి పార్టీ అధికారం కోల్పేయే సరికి మాజీ ఎమ్మెల్యేల బాధితులు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. వారి వల్ల ఆపద ఉందని తమ కంప్లైంట్లలో పేర్కొంటున్నారు. దాంతో గులాబీ నేతలకు వరుసగా కేసుల చట్రం బిగుస్తోందిప్పుడు.