YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పడకేసిన రియల్ ఎస్టేట్

పడకేసిన రియల్ ఎస్టేట్

హైదరాబాద్, మార్చి 27, 
మనదేశంలో స్థిరాస్తి వ్యాపారంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, నాగ్ పూర్, లక్నో వంటి నగరాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ ప్రాంతాలలో భారీగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దేశం మొత్తంలో ఇక్కడే ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉంటుంది. అయితే ఈ నగరాలలో ముంబై తరహాలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడం.. హైదరాబాదులో బహుళ కంపెనీలు ఏర్పాటు కావడంతో రియల్ ఎస్టేట్ గత కొన్ని సంవత్సరాలుగా అంచనాలకు మించి ఎదుగుతోంది. ఇదే సమయంలో వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలు నీట మునిగిపోతున్నాయి. రోడ్లు మొత్తం జలమయం అవుతున్నాయి. భూములకు ధర విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు మొత్తం కబ్జాకు గురయ్యాయి. నాలాలు నామరూపాలను కోల్పోయాయి. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తే చాలు కాలనీలకు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలని భావించింది. దీనికి భారీగా నిధులు కేటాయించింది. హైడ్రా ఆక్రమణకు గురైన చెరువులను సంరక్షించే బాధ్యతను భుజాలకు ఎత్తుకుంది. ఇందులో కొన్ని ఆరోపణలు వినిపించినప్పటికీ.. హైడ్రా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. కొన్ని విషయాలలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు కారణమవుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. హైడ్రాకు ఇంకా మరిన్ని అధికారాలు కట్టబట్టే ప్రయత్నం చేస్తోంది.హైడ్రా వల్ల హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని.. ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఇలాంటి ఆరోపణలు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మాత్రమే చేశాయి. అయితే తొలిసారిగా ఎంఐఎం కూడా ఈ పల్లవి అందుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ” హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల ఆక్రమణలు తొలగింపు మాట ఏమిటో గాని.. హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇప్పట్లో తిరిగి లేచే అవకాశం లేదు. మూసి ప్రక్షాళనను విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానిని ఎప్పుడు బాగు చేస్తారో తెలియదు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రానే. పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా తగ్గుతుంది. అప్పుడు పథకాలకు.. ఇతర వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వానికి తెలియాలని” అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. అయితే ఆసదుద్దీన్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఫాతిమా కాలేజీని చెరువులో నిర్మించారని.. దానిని పడగొట్టేందుకు హైడ్రా ప్రయత్నిస్తుండగా.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం వరకే ఫాతిమా కాలేజీకి అనుమతి ఇవ్వడం.. తదుపరి విద్యా సంవత్సరంలో దానిని పడగొడతారని తెలుస్తోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.. మార్కెట్ ఏం లేదు
మార్కెట్ ఖతం కావడానికి కారణమైన హైడ్రాకు, మూసీ ప్రక్షాళనకు కృతజ్ఞతలు – అక్బరుద్దీన్ ఒవైసీ

Related Posts