
న్యూఢిల్లీ, మార్చి 27,
ఇకపై, ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ప్రారంభించాలంటే తప్పనిసరిగా నాలుగు నామినేషన్లు చేర్చాలి. ఈ నిబంధన ప్రస్తుతానికి బిల్లు రూపంలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తుంది. ప్రతి బ్యాంక్ అకౌంట్‌లో నలుగురు వరకు నామినీలను యాడ్ చేసే అవకాశం కల్పించే "బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2024"ను పార్లమెంట్ ఆమోదించింది. వాస్తవానికి, ఈ బిల్లుకు గత ఏడాది (2024) డిసెంబర్‌లోనే లోక్‌సభ ఆమోదించింది. తాజాగా, రాజ్యసభ కూడా ఆమోదించింది. బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి సమయాల్లో నామినీలను యాడ్ చేయాలి. బ్యాంక్ లాకర్‌ను అద్దెకు ఇచ్చే విషయంలోనూ ఈ రూల్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీలు సహా కొన్ని పథకాల్లో నలుగురు నామినీల విధానం ఇప్పటికే అమలవుతోంది. వాస్తవానికి, నలుగురు నామినీల విధానం ఖాతాదారు కుటుంబానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఖాతాదారు అకస్మాత్తుగా మరణిస్తే, బ్యాంక్ ఆ ఖాతాలోని డబ్బును నామినీలకు అప్పజెబుతుంది. దీనివల్ల కుటుంబ వివాదాలు, చట్టపరమైన వివాదాలకు తావుండదు. కోర్టులకు ఎక్కి సంవత్సరాల తరబడి కేసులను సాగదీసుకుంటూ పోవడం అసలే ఉండదు.ప్రస్తుతం, బ్యాంక్ ఖాతా తెరవడానికి వెళ్ళినప్పుడు ఒక నామినీని తప్పనిసరిగా జోడించాలనే నిబంధన అమల్లో ఉంది. పొదుపు ఖాతా అయినా, ఉమ్మడి ఖాతా అయినా, కరెంట్ ఖాతా అయినా లేదా డీమ్యాట్ ఖాతా అయినా నామినీని తప్పనిసరిగా యాడ్ చేయాలి. దీని కోసం, ఆ ఖాతాదారు, నామినీగా యాడ్ చేయాలనుకునే వ్యక్తి పేరు, వయస్సు, ఖాతాదారుతో నామినీ సంబంధం, చిరునామా వంటి వివరాలు ఇవ్వాలి. అనుకోని పరిస్థితిలో ఖాతాదారు మరణించినట్లయితే, బ్యాంక్ ఎలాంటి అభ్యంతరం లేదా జాప్యం చేయకుండా ఆ ఖాతాలోని డబ్బును నామినీకి బదిలీ చేస్తుంది.కొన్ని బ్యాంక్‌ల్లో, ఖాతాదారు కోరుకుంటే, ఒకటి కంటే ఎక్కువ నామినీలను చేర్చవచ్చు. ఖాతాదారు మరణిస్తే, ఆ ఖాతాలోని డబ్బును నామినీలు అందరికీ సమానంగా బ్యాంక్ పంపిణీ చేస్తుంది. ఇది మాత్రమే కాదు, చాలా బ్యాంకులు ఏ నామినీకి ఎంత వాటా ఇవ్వాలో పేర్కొనే సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ముగ్గురు నామినీలను యాడ్ చేస్తే, ఒకరికి 50%, మిగిలిన ఇద్దరికి తలో 25% చొప్పున వాటా ఇవ్వాలని ముందే పేర్కొనవచ్చు. అవసరమైనప్పుడు దీనిలో ఎన్నిసార్లయిన మార్పులు కూడా చేయవచ్చు.
నామినీగా ఎవరి పేరు ఇవ్వాలి?
ఖాతాదారుడు వివాహితుడైతే, చట్టబద్ధమైన వారసులు అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. ఖాతాదారుడు వివాహం చేసుకోకపోతే అతని తల్లిదండ్రులు, తోబుట్టువులను నామినీలుగా యాడ్ చేయవచ్చు. ఖాతాదారు మరణిస్తే, అతని చట్టబద్ధ వారసులుగా డిపాజిట్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
బ్యాంకు ఖాతాలో నామినీ లేకపోతే?
బ్యాంకు ఖాతాలో నామినీని చేర్చకుండా ఖాతాదారు మరణిస్తే, అతని చట్టబద్ధ వారసులు, ఆ విషయాన్ని బ్యాంక్‌కు తెలియజేయాలి. ఖతాదారు మరణ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకుకు సమర్పించాలి.
ఖాతాలోని డబ్బును కోరే వ్యక్తి, తాను ఆ ఖాతాదారుకు చట్టబద్ధమైన వారసుడిని అని నిరూపించుకునే ధృవీకరణ పత్రం లేదా వారసత్వ ధృవీకరణ పత్రాన్ని బ్యాంక్ సమర్పించాలి.
చట్టపరమైన వారసుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, KYC, డిస్‌క్లైమర్ లెటర్ అనుబంధం-A, నష్టపరిహార లేఖ అనుబంధం-C, నివాస రుజువు వంటివి కూడా సబ్మిట్ చేయాలి.
బ్యాంకు ఆ పత్రాలను తనిఖీ చేస్తుంది. అవసరమైతే, కోర్టు ఇచ్చే వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురమ్మని కూడా అడగవచ్చు.
అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, బ్యాంకు చట్టపరమైన వారసుడికి డబ్బు చెల్లిస్తుంది.