YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పిఠాపురం

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పిఠాపురం

కాకినాడ, మార్చి 28, 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా? లేక వాటంతట అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్ కల్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనపడుతుంది. వరసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పవన్ కల్యాణ్ కు అన్నీ తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటే, పవన్ వస్తే అంతా సెట్ రైట్ అవతుందని జనసైనికులు చెబుతున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు జనసేన నేతలు ఇంత కాంట్రవర్సీతో కొని తెచ్చుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు ముందు నుంచే టీడీపీ, జనసేనల మధ్య వార్ ప్రారంభమయినట్లు కనిపిస్తుంది. ఎలాగంటే మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పిఠాపురం అంటే పవన్ కల్యాణ్ అడ్డా అని అనడం, అక్కడ మరో నేతకు అవకాశం లేదని చెప్పడం వివాదంగా మారింది. నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కల్యాణ్ కు తెలియకుండా చేశారని అనుకోలేం. అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏం మాట్లాడినా జనసేన నేతలు ఆచితూచి మాట్లాడతారు. నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ అడ్డా పిఠాపురం అనడంతో వర్మతో పాటు అనేక మంది టీడీపీ నేతలకు కొంత ఇబ్బందికరంగా మారింది. తర్వాత ఆవిర్భావ సభలోనూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోశాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపునకు పవన్ ఒక కారణమయితే, జనసేన క్యాడర్ మరో కారణమని, ఎవరైనా తామే పవన్ విజయానికి కారణమని భావిస్తే వారి ఖర్మ అని చేసిన వ్యాఖ్యలు వర్మతో పాటు టీడీపీ స్థానిక నేతల్లో గునపాలు దిగినట్లయింది. దీంతో పాటు అదే సభలో పవన్ కల్యాణ్ కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చామని చెప్పి మరింత వివాదానికి తావిచ్చారు. అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు, క్యాడర్ మధ్య పొసగడం లేదన్నది యదార్థం. కానీ రెండు పార్టీల అగ్రనేతలు పిఠాపురం లో జరుగుతున్నవిషయాలను పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ ముదురుతున్నాయి. తాజాగా పిఠాపురం జనసేన ఇన్ ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. నియోజకవర్గంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తమ నేత వర్మకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం వల్లనే టీడీపీ శ్రేణులు బరస్ట్ అయ్యారంటున్నారు. ఇలా పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం విభేదాలను మాపే ప్రయత్నం చేయకపోవడం కూడా టీడీపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంత జరుగుతున్నా తమ పార్టీ నేతలకు, క్యాడర్ కు సర్దిచెప్పాల్సిన పవన్ మౌనం పాటించడం వెనక వర్మను సైడ్ చేయాలన్న లక్ష్యమే కనిపిస్తుందన్న అభిప్రాయం పిఠాపురం టీడీపీ నేతల్లో మరింత బలపడుతుంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.
వరుస సమీక్షలు
పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.  పిఠాపురం నియోజక వర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) డైరెక్టర్  పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. తమ పర్యటన వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ వేసవి సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాము. వాటిని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పవన్ తెలిపారు.  అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి వారం ఈ పనులపై సమీక్ష చేపడతాను. అధికారులు క్షేత్ర స్థాయి పురోగతిని నిశితంగా పరిశీలించాలి. పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తన కార్యాలయ దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోందని..  విద్యుత్ అంతరాయ సమస్య ఉందని తెలియగానే టిడ్కో గృహాల దగ్గర రూ.3 కోట్లతో 5 ఎం.వి.ఎ సామర్థ్యంతో కొత్త సబ్ స్టేషన్ పనులు చేపట్టామమన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశామని పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగామమన్నారు. రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టాము. అదే విధంగా 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చాము. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సి.హెచ్.సి. నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాము. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా చూపుతుందో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకత్వంలో వాటిని సద్వినియోగపరుస్తున్నాము. ఈ క్రమంలో అధికారులు, ఉద్యోగులు సానుకూల దృక్పథంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు.నియోజకవర్గంలో శాంతిభద్రతల అంశంపై ప్రత్యేక సూచనలు చేశారు.  పిఠాపురం నియోజక వర్గ పరిధిలో పోలీసింగ్ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఊటంకిస్తూ, నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా శాఖ చులకన అవుతోందన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టే నేరస్తులనే కాదు, వారికి అండగా ఉండే నాయకులను, పోలీసులను కూడా ఉపేక్షించకూడదన్నారు. తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను వివరించి వాటిని సత్వరమే జిల్లా పోలీసు అధికారులకు తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

Related Posts