సమర్పణ: మహేశ్ కోనేరు
నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్
తారాగణం: నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా, పోసాని కృష్ణమురళి, వెన్నెలకిశోర్, తనికెళ్లభరణి, సురేఖా వాణి తదితరులు
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
కూర్పు: టి.ఎస్.సురేశ్
కథ, స్క్రీన్‌ప్లే: జయేంద్ర శుభ
నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి
దర్శకత్వం: జయేంద్ర
పాత్రల పరంగా ఏదో ఒక కొత్తదనాన్ని చేయాలనుకునే హీరోల్లో కల్యాణ్ రామ్ ఒకరు. నందమూరి మూడోతరం నటవారసుల్లో ఒకరైన కల్యాణ్ రామ్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతుంది. కెరీర్ ప్రారంభంలో వచ్చిన `అతనొక్కడే`, ఇటీవల వచ్చిన `పటాస్` వంటి హిట్స్ తర్వాత తనకు చెప్పుకునే స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. అయితే ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ సడెన్‌గా యూ టర్న్ తీసుకుని చేసిన పూర్తిస్థాయి రొమాంటిక్ టైనర్ `నా నువ్వే`. కెరీర్ ప్రారంభంలో హీరోలు రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తారు. అలాంటి ఈ సమయంలో ఎందుకు చేశాడు? అసలు కల్యాణ్ రామ్ రొమాంటిక్ సినిమాలకు సూట్ అవుతాడా? ఇలా చాలా మందికి చాలా సందేహాలే వచ్చాయి. మరి సందేహాలన్నీ తీరాయో లేదో.. తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
మీరా(తమన్నా) రెడియో జాకీ. ప్రేమికుల రోజు సందర్భంగా 36 గంటల రేడియో మారథాన్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తుంది. అందులో తన ప్రేమ కథను చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. వరుణ్(నందమూరి కల్యాణ్‌రామ్) పి.హెచ్.డి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. అతని స్నేహితులు(వెన్నెల కిశోర్, ప్రవీణ్) కూడా అతనితోనే ఉంటారు. అయితే ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రతిసారి వరుణ్ ఏదో ఒక కారణంతో ఫ్లైట్ మిస్ చేసుకుంటూ ఉంటాడు. వరుణ్ బామ్మ కల్యాణి తనకు పెళ్లి చేయాలని లవ్ సైన్ పుస్తకం కొంటుంది. ఓ సందర్భంలో దాన్ని వరుణ్ చదవడానికని తీసుకుంటాడు. ఆ పుస్తకాన్ని ట్రెయిన్‌లోనే మరచిపోతాడు. అది అనుకోకుండా మీరాకి దొరుకుతుంది. మీరా కూడా ఆ పుస్తకాన్ని ఇంకేవరికో ఇచ్చేసినా కూడా అది మీరా దగ్గరికి మళ్లీ చేరుకుంటుంది. అసలే విధిని బలంగా నమ్మే మీరా.. తనకు, ఆ పుస్తకంతో ఏదో రిలేషన్ ఉందని నమ్ముతుంది. ఆ పుస్తకం ఓపెన్ చేయగానే అందులో వరుణ్ ఫోటోను చూస్తుంది. వరుణ్‌ని చూడగానే తను అప్పటి వరకు పాస్ కానీ ఎగ్జామ్స్ పాస్ అయిపోవడం సహా కొన్ని పనులు జరిగిపోతాయి. దాంతో వరునే తన లక్కీ అని మీరా బలంగా నమ్మి అతనితో ప్రేమలో పడుతుంది. సిటీలో అతన్ని చూసిన ప్రతిసారి కలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. వరుణ్ కూడా మిస్ అవుతుంటాడు. ఓసందర్భంలో వరుణ్‌ని కలుసుకుని తనకు జరిగిన అనుభవాలు చెప్పి ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే వరుణ్.. మీరాకు ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటి? మీరా అందులో నెగ్గుతుందా? ఇద్దరు కలుసుకుంటారా? అసలు ఇద్దరి మధ్య గొడవలేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రేమ, విధి అనే రెండు అంశాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు జయేంద్ర రాసుకున్న కథ. ఇందులో ప్రేమికగా నటించిన తమన్నా... డెస్టినీ నమ్మి ప్రేమికుడు కల్యాణ్ రామ్ వెంటపడుతుంది. డెస్టినీని నమ్మని కల్యాణ్ ఆమె ప్రేమకు పెట్టే పరీక్షే సినిమా. కథ గురించి చెప్పాలంటే ఇంతకంటే ఏం లేదు. ప్రేమకథలు ఒకేలా ఉన్నా.. ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్లనే సగం ప్రేమకథలు విజయవంతం అవుతుంటాయి. అలాగే ప్రేమ కథల విషయానికి వస్తే సంగీతం, సినిమాటోగ్రఫీ కీలక భూమికలు పోషిస్తాయి. ఈ సినిమా విషయానికి వస్తే శరత్ సంగీతం బావుంది. ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించాడు. నేపథ్య సంగీతం కూడా బావుంది. అలాగే పాటల పిక్చరైజేషన్ చాలా బావుంది. ఇక పి.సి.శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి విజువల్ బ్యూటీఫుల్‌గా అనిపిస్తుంది. ప్రేమిక సాంగ్... హె ఐలయు సాంగ్స్ బావున్నాయి. ఎడిటింగ్ కూడా కథానుగుణంగా చక్కగా ఉంది. ఇక కల్యాణ్‌రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కొన్ని సన్నివేశాల్లో అయితే తమన్నా ఎక్స్‌ప్రెషన్స్ కృతకంగా ఉన్నాయి. సినిమాలో ఎంగేజింగ్ సీన్స్ లేవు. అలాగే ఫన్ పార్ట్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. వెన్నెలకిశోర్, ప్రవీణ్ రామలింగ్వేర స్వామి కామెడీ మెప్పించలేదు. పాత్రల మధ్య ప్రేమకథల్లోని ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా మెయిన్ పాయింట్‌ను సాగదీసిన భావన కలుగుతుంది. ఇక సినిమాలో బిత్తిరి సత్తి కామెడీ కూడా బేషుగ్గా లేదు. తమన్నా లుక్ పరంగా చాలా అందంగా కనపడింది. కల్యాణ్‌రామ్ మేకోవర్ బావుంది. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగానే మెప్పించిన కల్యాణ్‌రామ్‌లో కొత్తకోణం ప్రేక్షకులకు నచ్చుతుంది. మొత్తంగా డైరెక్టర్ జయేంద్ర సినిమాను గ్రిప్పింగ్‌గా హ్యాండిల్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు.
రేటింగ్: 2.25/5