YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 28, 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సంచలన నిర్ణయాలతో అమెరికన్లను, ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికోపై సుంకాలు పెంచారు. ఏప్రిల్‌ 2 నుంచి ప్రపంచ దేశాలన్నింటిపై సుంకాలు విధిస్తామన్నారు. ఇప్పుడు దిగుమతి కార్లపైనా సుంకాలు విధించాలని నిర్ణయించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారై యూఎస్‌లోకి దిగుమతయ్యే అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బుధవారం వైట్‌హౌస్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానుంది. ‘అమెరికాలో తయారుకాని కార్లపై 25% సుంకం విధిస్తున్నాం. ఇది శాశ్వత చర్య. ఇక్కడ తయారయ్యే వాహనాలపై మాత్రం సుంకాలు ఉండవు. ఈ నిర్ణయం మా ఆర్థిక వృద్ధిని పెంచి, ఇప్పటివరకూ చూడని అభివృద్ధిని సాధిస్తుంది‘ అని ట్రంప్‌ వెల్లడించారు. ఈ ప్రకటనలో చైనాపై ప్రత్యేక దృష్టి సారించారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై తొలుత 10 శాతం సుంకం విధించిన ట్రంప్, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి పెంచారు. ఇప్పుడు చైనాకు ఓ ఆసక్తికర ఆఫర్‌ ప్రకటించారు. ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను విక్రయిస్తే, సుంకాలను తగ్గించే అవకాశం ఉందని, అవసరమైతే ఒప్పంద గడువును కూడా పొడిగిస్తామని విలేకరులతో చెప్పారు.
టిక్‌టాక్‌పై అమెరికా ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. యూఎస్‌ నిబంధనలకు కట్టుబడనందుకు జనవరి గూగుల్, ఆపిల్‌ ప్లే స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించాయి. అయితే, ట్రంప్‌ నిషేధ అమలును వాయిదా వేయడంతో టిక్‌టాక్‌ మళ్లీ యాప్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో దీనికి 170 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌టాక్‌ కొనుగోలు గురించి ఎలాన్‌ మస్క్‌ పేరు వార్తల్లో వచ్చినా, ఆయన దాన్ని తోసిపుచ్చారు.ట్రంప్‌ ఇటీవల ‘సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌’ సృష్టించాలని ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ఆదేశించారు. ఈ ఫండ్‌తో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సూచించారు. ఈ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్య విధానంలో ట్రంప్‌ దూకుడును చాటుతున్నాయి.

Related Posts