
హైదరాబాద్, మార్చి 28,
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయో పేర్లు కూడా ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ క్లైమాక్స్‌లో ట్విస్ట్ రేంజ్‌లో..హస్తం పార్టీలో మాల, మాదిగల పంచాయితీ షురూ అయింది. ఇప్పటికే మాలలకు పలు పదవులు ఇచ్చారని, మళ్లీ వారికే ఇస్తామంటే ఎలా అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మాదిగ వర్గం ఎమ్మెల్యేలు. తమ వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో పలువురు మాదిగ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దల దగ్గర విన్నవించేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు టాక్. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేలు, కాలే యాదయ్య లాంటి శాసనసభ్యులు..క్యాబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్‌లో మాల సామాజిక వర్గానికి పదవులు ఎక్కువగా ఇచ్చారనే చర్చ ఉన్న నేపథ్యంలో వారికి ఇంకా ఎన్ని పదవులు ఇస్తారని మాదిగ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ వర్గానికి ఓ మంత్రి పదవి స్పీకర్ పోస్ట్ ఇచ్చారని..ఎస్సీ కోటాలో మూడు లోక్‌సభ సీట్లు ఉంటే రెండు మాలలకే ఇచ్చారని అభ్యంతరం తెలుపుతున్నారు.అంతేకాదు.. లేటెస్ట్‌గా ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీల్లోనూ మాల వర్గానికే అవకాశం ఇచ్చారని ..ఈసారి తమకు కచ్చితంగా క్యాబినెట్‌లో చోటు కల్పించాలని కోరుతున్నారట.
అయితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతోనే మాదిగ ఎమ్మెల్యేలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు ఎమ్మెల్యే పదవులు, ఒక ఎంపీ పదవి ఇవ్వడమే కాక మళ్లీ మంత్రి పదవి ఇస్తే ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు తప్పడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారట మాదిగ వర్గం ఎమ్మెల్యేలు.అయితే మొన్నటి వరకు మాల, మాదిగల మధ్య వర్గీకరణ గొడవ నడిచింది. ఈ నేపథ్యంలో మాదిగలు లక్ష డప్పులతో నిరసన తెలిపేందుకు ప్లాన్ చేశారు. అంతలోపే మాలల సభలు నిర్వహించారు వివేక్. ఆయనలా సభలు పెట్టడం..మాదిగ వర్గం ప్రజా ప్రతినిధులకు నచ్చలేదు. అదే టైమ్‌లో కాంగ్రెస్ పార్టీలో మాల వర్సెస్ మాదిగా పంచాయితీ పీక్ లెవల్‌కు చేరింది.ఒకానొక టైమ్‌లో వివేక్ టార్గెట్‌గా పలువురు మాదిగ వర్గానికి చెందిన నేతలు విమర్శల దాడి చేశారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పడంతో వివాదం ముగిసిందనుకున్నారు. ఇంతలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోందన్న ప్రచారంతో పాటు..ఎమ్మెల్యే వివేక్ పేరు మంత్రి పదవి రేసులో తెరమీదకు రావడంతో మాదిగ వర్గం ఎమ్మెల్యేలు గళమెత్తడం చర్చనీయాంశంగా మారింది.ఇక మాల, మాదిగ పంచాయితీ ఇలా ఉంటే..మైనార్టీ కోటా కింద మంత్రివర్గంలో ఓ బెర్త్ కల్పించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.
అయితే అమీర్ అలీ ఖాన్‌కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌తో సఖ్యత లేదని..అమీర్‌కు మంత్రి పదవి ఇస్తామంటే అసద్ అభ్యంతరం తెలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంఐఎంతో గ్యాప్ పెంచుకోవడం ఎందుకని..మైనార్టీ కోటాలో క్యాబినెట్‌లోకి ఇప్పుడు ఎవరినీ తీసుకోవద్దని భావిస్తున్నారట సీఎం రేవంత్.మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌తో పాటు నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నా..ఫిరోజ్‌ఖాన్ అంటే కూడా అసద్‌కు పొసగదు. ఇక అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఆయనను ఎమ్మెల్సీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయ్యే పని కాదని..ప్రస్తుతానికి మైనార్టీ కోటా మ్యాటర్ పక్కాకు పెట్టాలని అనుకుంటున్నారట. దాంతో మైనార్టీ వర్గం నేతల నుంచి అసంతృప్తి, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనుకున్న క్యాబినెట్ విస్తరణ.. ఈ రెండు వర్గాల అభ్యంతరాలతో మళ్లీ మొదటికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. మైనార్టీ కోటాలో ఎవరినీ తీసుకోకపోయినా..లేక వివేక్‌కు లాస్ట్ మినిట్‌లో మినిస్ట్రీ మిస్ అయినా..అసంతృప్తి తప్పదని అంచనా వేస్తున్నారట. క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరిన వేళ వస్తున్న అభ్యంతరాలను..కాంగ్రెస్ పెద్దలు, అధిష్టానం ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.