YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

90 శాతం వడ్డీ మాఫీ... ఆస్తి పన్ను బంపర్ ఆఫర్..

90 శాతం వడ్డీ మాఫీ... ఆస్తి పన్ను బంపర్ ఆఫర్..

హైదరాబాద్, మార్చి 28, 
తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిల వడ్డీని 90శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను అమల్లోకి తెచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలన్నీటిని ఒకేసారి చెల్లించిన వారికి 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలను వడ్డీతో సహా చెల్లించిన ఇంటి యజమానులకు వచ్చే ఏడాది ఆస్తిపన్నుల్లో 90 శాతం వడ్డీ మాఫీని వర్తింపజేస్తూ మిగిలిన పన్నులను వసూలు చేయాలని సూచించింది.2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలుకై ప్రత్యేక చర్యలు చేపట్టారు. పన్ను బకాయి దారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేసి, ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు.రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించని బకాయిదారుల ఆస్తులు సీజ్ చేసి మున్సిపల్ పరంగా సేవలను నిలిపివేస్తున్నారు. నల్లా కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో ఓ థియేటర్, పార్క్, పలు షాపులు, ఇళ్లను సీజ్ చేశారు.
సెలవు రోజుల్లో సైతం పన్నువసూళ్ళపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బకాయి వసూళ్ళకు హైదరాబాద్ తరహాలో వడ్డీ మాఫీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.దీంతో ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింపజేసింది. ఈ పథకాన్ని మార్చి మొదటి వారంలో ప్రకటిస్తే ఇప్పటి వరకు చాలా మేరకు వడ్డీ మాపీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పన్నులు చెల్లించేవారు. నెలాఖరులోగా ఆర్ధిక సంవత్సరం ముగియనుండగా ఐదు రోజుల గడువుతోనే ఈ వడ్డీ మాఫీ పథకాన్ని అమల్లోకి తేవడంతో ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు నగర పాలక సంస్థలతోపాటు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. జమ్మికుంట, హుజూరాబాద్ రెండు మున్సిపాలిటీల్లో మినహా ఎక్కడా ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు చాలా ఏళ్ళ నుంచి బకాయిపడ్డ వారు ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు 52 కోట్ల రూపాయల ఆస్తిపన్నులు వసూలు కావాల్సి ఉంది.కానీ ఇప్పటివరకు కేవలం 65 శాతం సుమారు 34 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్నులు వసూలయ్యాయి. మిగిలిన 18 కోట్లలో బకాయిలే ఎక్కువగా ఉండడంతో 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని అమలులోకి తేవడంతో బల్దియా ఆదాయం ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటి వరకు వడ్డీతో కలిపి ఆస్తిపన్నులు చెల్లించిన ఇంటి యజమానులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వడ్డీలోని 30 శాతం ఆస్తిపన్ను చెల్లించినట్లుగా జమ చేయాల్సి ఉండడంతో మరో కోటి రూపాయల మేరకు ఆదాయం తగ్గవచ్చని భావిస్తున్నారు. బకాయిలపై వడ్డీ మాఫీ పథకంతో ఎక్కువగా లబ్ది పొందేది నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలేనని, మిగిలిన మున్సిపాలిటీల్లో అంతగా ప్రభావం ఉండదని చెబుతున్నారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంకా 38,654 మంది తమ ఆస్తిపన్నులను చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని అమలులోకి తెచ్చినందున వెంటనే ఆస్తిపన్ను బకాయిలను ఏకమొత్తంలో చెల్లించి వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు చెల్లించే పన్నులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉందని తెలిపారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని మునిసిపల్ అధికారులు కోరుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో మినహా ఏ మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో ఆస్తిపనుసులు కాలేదు, కొన్నిచోట్ల 70% మరికొన్నిచోట్ల 90% వరకు పన్ను వసూలు అయింది. 100% ఆస్తిపన్ను వసూలు కావాలంటే ప్రస్తుతం ఇచ్చిన ఆస్తిపన్నులో 90శాతం వడ్డీ మాఫీ వన్ టైం సెటిల్మెంట్ ను నగర ప్రజలు స్వాగతిస్తు మరో 15 రోజుల వరకు పొడిగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మార్చి 31 లోగా చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందంటూ గడుపు విధించారని, ఈ ఐదు రోజుల్లో 30వ తేదీన ఉగాది, 31న రంజాన్ పండుగలు ఉన్నందున వడ్డీ మాఫీ పథకాన్ని పొడగించాలని ప్రజలు కోరుతున్నారు. వడ్డీ మాఫీ గడువును పొడగిస్తేనే వంద శాతం ఆస్తిపన్ను వసూలవుతాయని, ఐదురోజుల్లో టార్గెట్ చేరుకోవడం కష్టమేనని మున్సిపల్ అధికారులు అంటున్నారు.

Related Posts