
తిరుమల, మార్చి 29,
తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు నానా కష్టాలు పడతారు. సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి వస్తుంటారు. ఒక్కసారి శ్రీవారిని దర్శించుకుంటేచాలని కొందరు అనుకుంటారు. మరికొందరైతే ప్రతీ ఏడాది వెళ్తున్నారు. ప్రతీ రోజూ వేలల్లో భక్తులు అక్కడికి వస్తుంటారు. అయినా గంటల తరబడి భక్తులు క్యూ కాంప్లెక్సుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.భక్తులకు వేగంగా దర్శనం అయ్యేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. దీనికి టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబు సూచన మేరకు గూగుల్‌తో ఒప్పందానికి రెడీ అవుతోంది. టీటీడీ-గూగుల్ మధ్య మరో వారంలో ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందం ప్రకారం తిరుమలకు వచ్చే భక్తుల దర్శనాలతోపాటు వసతి, వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకోనుంది.తిరుమలకు ఏ సీజన్‌లో భక్తులు అధికంగా వస్తున్నారు? రద్దీ ఎక్కువగా ఎక్కడ ఉంటోంది? ఏ టైమింగ్ ఎక్కువగా దర్శించుకుంటున్నారు? అనే సమాచారం టీటీడీ తెలియనుంది. అందుకు అనుగుణంగా గూగుల్ తన సేవలు అందించనుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుంది.దర్శనానికి సంబందించిన విధివిధానాలు, డ్రెస్ కోడ్, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో భక్తులు తెలుసుకోవడం ఇక ఈజీ అవుతుంది. దేశ విదేశాల నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారి భాషల్లో సమాచారం అందించనుంది.ఒప్పందం తర్వాత గూగుల్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. గతంలో ఎదురైన ఘటనలు దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఆ తర్వాత ఏఐని వినియోగించనున్నారు. కొన్ని దేవాలయాలు ఏఐని వినియోగిస్తున్నాయి. కేవలం భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమైంది. తిరుమలలో ఏఐ సేవలు ఉచితంగా అందించడానికి గూగుల్ ముందుకొచ్చింది.గూగుల్ మ్యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు తెలుసుకోవడం వీలవుతుంది. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా గదుల కోసం సీఆర్వో కార్యాలయం వస్తుంటారు. ఆ తర్వాత అన్న ప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట వద్ద రద్దీ, ఆరోగ్య కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఇకపై ఎవర్నీ అడగాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఫోన్ ద్వారానే సమాచారం తెలుసుకోవచ్చు. వారి ఫోన్‌లకే ఆయా నోటిఫికేషన్లు వస్తాయి.తిరుమలలో గూగుల్ ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనుంది. తద్వారా అనుమానితులు, నిందితులు ఎవరైనా సంచరిస్తున్నారా? అన్నది నేరుగా విజిలెన్స్ సిబ్బందికి తెలియనుంది. దీంతో వారిపై నిఘా ఉంచేందుకు వీలవుతుంది. నిందితుల ఫొటోలు నిక్షిప్తంగా ఉంటాయి కూడా. ఏఐ ద్వారా దళారులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గడం ఖాయమన్నది టీటీడీ ఆలోచన.గూగుల్ ఏఐ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ రానుంది. రాబోయే రోజుల్లో భక్తులు ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవచ్చు. ఆ భక్తుడు తిరుమల వచ్చినప్పుడు తన ఫోన్ ద్వారా సంబంధిత సేవలు తెలుస్తాయి.ఎవరెన్నిసార్లు దర్శనానికి వచ్చారు? ఎన్ని గదులు తీసుకున్నారనేది సమాచారం టీటీడీ వద్ద ఉండనుంది. కేవలం సమాచారానికి షేర్ చేయడానికి మాత్రమే కాకుండా రెండో వైపు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.