
ఒంగోలు, మార్చి 29,
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి 97.52కోట్లు కేటాయించింది. రాష్ట్ర పర్యాటక శాఖ టూరిజం సమర్పించినడీపీఆర్ కు అనుగునంగా ఈ నిధులు కేటాయింపు జరిగింది. సూర్యలంక కు వచ్చే పర్యాటకులు ప్రపంచ స్థాయి పర్యాటక అనుభూతిని పొందేలా ఈ నిధులు ఖర్చు చేస్తామని రాష్ట్ర పర్యాటకమంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నిధుల్లో పర్యాటకానుభూతిని మెరుగుపరచడానికి, కొత్త అంశాలను రూపొందించేందుకు ₹15.43 కోట్లు, షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధికి ₹4.37 కోట్లు, స్థి పర్యాటక వాహనాల పార్కింగ్ సదుపాయాల కోసం ₹7.76 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే బ్యాక్ వాటర్ కోసం ₹11.69 కోట్లు, సూర్యలంక ఎక్స్ పీరియన్స్ అభివృద్ధికి ₹19.36 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹18 కోట్లు వినియోగించనున్నారు.ఇంతకు ముందే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 172.34 కోట్లు మంజూరు చేసింది. ఈ ఆమోదంతో, ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం నిధులు ₹269.86 కోట్లకు చేరాయి.బాపట్ల జిల్లా సూర్యలంకలోని బీచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కొత్త రాజధాని అమరావతికే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కూడా సమీపంలో ఉన్న బీచ్ సూర్యలంక. హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇప్పటికే ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేను నర్సరావుపేట వద్ద నుంచి బాపట్లతో కలిపేలా మరో నాలుగు వరుసల హైవేకు ఈ మధ్యనే ఆమోదం తెలిపారు. అది పూర్తైతే... హైదరాబాద్ నుంచి నేరుగా బీచ్‌కు ఫోర్‌లేన్ జాతీయ రహదారి వచ్చేస్తుంది. కోస్తా జాతీయ రహదారిని ఇప్పటికే డవలప్ చేశారు. ఇక బాపట్ల బీచ్ కేవలం సముద్ర తీరం మాత్రమే కాదు. దీంట్లోకి ఓ కెనాల్ కూడా కలుస్తుంది. దాంతో బ్యాక్‌వాటర్ టూరిజం ను కూడా డవలప్ చేయొచ్చు.అమరావతికి సముద్రతీరాన ఉన్న ప్రధాన అట్రాక్షన్ సూర్యలంక. ఇప్పటికే ఇక్కడ టూరిజం శాఖ హరిత రిసార్టులు నిర్వహిస్తోంది. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ రిసార్టులున్నాయి. సూర్యలంకను గ్లోబల్ ఐకానిక్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ పథకం కోసం 101కోట్లకు డీపీఆర్ ఇచ్చింది. ఇందులో బీచ్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడం, లాండ్ స్కేపింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ ల అభివృద్ధి, సెయిలింగ్ క్లబ్ వంటి అంశాలున్నాయి. బీచ్‌లో ఐకానిక్ ధ్యానమందిరం కన్వెన్షన్ సెంటర్‌ను కూడా ప్రతిపాదించారు. బీచ్‌లో కలిసే కాలువపైన హౌస్ బౌటింగ్, ఫ్లొటొంగ్ రెస్టారెంట్ ను ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా సూర్యలంక సమీపంలో ప్రైవేట్ భాగస్వామ్యంలో 650కోట్లతో ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టులు వస్తున్నాయని కూడా డీపీఆర్‌లో పేర్కొన్నారు.స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్ట్ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన ఒక పర్యాటక అభివృద్ధి కార్యక్రమం. ఇది స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్ కి కొత్త రూపం, దీని ద్వారా దేశీయ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం, స్థానిక ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం, రోడ్లు, హోటళ్లు, పార్కింగ్, సమాచార కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించడం, భారతీయ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రోత్సహించడం వంటివి ఈ ప్రాజెక్టులో చేపడతారు. స్వదేశ్ దర్శన్ 2.0 ప్రత్యేకంగా సమగ్ర పర్యాటక ప్రణాళికపై దృష్టి సారిస్తుంది. ఇందులో రూరల్, ఎకోటూరిజం, ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది.