
హైదరాబాద్, మార్చి 29,
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ బీజేపీ రివర్స్ గేర్ వేసింది. అయితే ఈ బిల్లు ఇప్పటికే శాసన సభలోను, శాసన మండలిలో ఆమోదం పొందింది. ఇప్పటి దాకా విద్య ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు అమల్లో ఉన్న 29 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి రిజర్వేషన్ల పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించింది. ఈ గణనలో 56.36 శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బీసీలకు 42శాంత రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించదని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయని.. అది తప్పుడు ప్రచారమని అసెంబ్లీలో బీసీ రిజర్వషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు.అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మాట మారుస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వైఖరి మార్చుకోవడం వెనక అమిత్ షా ఎఫెక్ట్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ సమావేశంలో బీజేపీ కేంద్ర పార్టీ విధానానికి వ్యతిరేకంగా బీసీ బిల్లుకు ఎలా మద్దతు ప్రకటించారని అమిత్ షా ప్రశ్నించారని సమాచారం..తెలంగాణ బీజేపీ నేతలపై షా ఎఫెక్ట్ పడటంతో ముస్లింలను బీసీల్లో కలిపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు రూపొందించడం తప్పని తెలంగాణ బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.మొత్తానికి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ బీజేపీ అమిత్ షా ఎఫెక్ట్‌తో ఇప్పడు ఇరకాటంలో పడినట్లు కనిపిస్తోంది.