
విజయవాడ, ఏప్రిల్ 1,
వంగవీటి రంగా హత్య తర్వాత ఆ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలు పెద్దగా కలసి వచ్చినట్లు కన్పించడం లేదు. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరొకసారి కుమారుడు వంగవీటి రాధా ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు పిలుపు వినిపించలేదు. ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తల్లీ కొడుకులకు కేవలం చెరొక సారి మాత్రమే ఎమ్మెల్యే అవకాశం లభించింది. దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు నాడు టిక్కెట్ కూడా దొరకలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు.ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీగా పదవి వచ్చేది కూడా కష్టంగా మారింది. కాపు సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వంగవీటి కుటుంబాన్ని అన్ని పార్టీలూ పక్కన పెడుతున్నాయి. ప్రధానంగా టీడీపీ కూడా ఇప్పుడు పక్కన పెట్టడానికి ఎక్కువ మంది కాపులకు మొన్న అవకాశం కల్పించడమే. ఎమ్మెల్సీలుగా ఐదు పోస్టులు ఖాళీఅయినా, అదీ ఎమ్మెల్యే కోటాలో అయినా ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరూ ఎక్సెప్ట్ చేశారు. కానీ జనసేన నుంచి కొణిదల నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులను ఆ పార్టీ నాయకత్వాలు ఎంపిక చేయడంతో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేని పరిస్థితి టీడీపీ నాయకత్వానికి ఎదుయింది. మిగిలిన సామాజికవర్గాలకు ఇవ్వాల్సి వచ్చిందివంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడూ ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు. టీడీపీ ఓటమి పాలవ్వగా, ఆయనకు టిక్కెట్ కూడా దక్కలేదు. 2024 ఎన్నికల్లోనూ వివిధ కారణాలతో ఆయన పోటీకి దూరంగా ఉంచింది టీడీపీ అధినాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించింది. వంగవీటి రాధా రాష్ట్ర మంతటా పర్యటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, మచిలీపట్నం,గుడివాడ ఇలా అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ అధినాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత వరకూ వంగవీటి రాధాకు పదవి రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. వంగవీటి రాధా కంటే ఇప్పుడు కాపు సామాజికవర్గంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్లుగా ఉన్నారు. ఆయన కాపులందరినీ ఏకతాటిపైకి తేగలిగిన నాయకుడు కావడంతో ఇక రాధాతో పనేంటి? అన్న ధోరణిలో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు కనపడుతుంది. మరోవైపు జనసేన ఇచ్చే పదవులు కాపులకే అయినప్పుడు, తాము కూడా అదే సామాజికవర్గానికి ఇచ్చేదానికంటే మరొక క్యాస్ట్ కు ఇచ్చి ఆ ఓట్లను సొంతం చేసుకోవడానికి టీడీపీ నాయకత్వానికి మరొక దారి కనిపించడం లేదు. అందుకే వంగవీటి రాధా కంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ ముఖ్యం కావడం, మిత్రపక్షంగా ఉండటంతో ఆయనకే ప్రయారిటీ ఇస్తారని, ఇక తమ నేతకు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వంగవీటి రంగా అభిమానుల నుంచి వ్యక్తమవుతుంది.