YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం జిల్లాలో పుంజుకుంటోన్న టీడీపీ, జనసేన

విజయనగరం జిల్లాలో పుంజుకుంటోన్న టీడీపీ, జనసేన

విజయనగరం, ఏప్రిల్ 1, 
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత పుంజుకుంటోందా? అంటే అవుననే తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పూర్తిగా ఖాళీ కాబోతుందా? అంటే కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది.కురుపాం నుంచి ఎస్ కోట నియోజకవర్గం వరకూ ఎక్కడ చూసినా రాజకీయ వలసలు షరా మాములుగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డానికి కష్టించి పని చేసిన హార్డ్ కోర్ ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైకిల్ బెల్లు కొట్టడానికి రెడీ అంటే రెడీ అంటున్నారటఒక్కో ఏరియాలో ఫలానా కావాలన్న షరతులు పెట్టకుండానే ఫ్యాన్ వదిలి సైకిలెక్కుతున్నారట. దీనంతటికీ కారణమేంటని చూస్తే.. అందరి నుంచి దాదాపు ఒకటే మాట వినిపిస్తోందట. ఇన్నాళ్ల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీని అధికారంలోకి తెస్తే.. తమకు మిగిలింది ఏదీ లేదని వీరంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఆ మాటకొస్తే ఫ్యాను రెక్కలు ముక్కలయ్యాయి.. మీ కంటికి కనిపించడం లేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఇన్నాళ్ల పాటు జగన్ని నమ్ముకున్నందుకు తాము నట్టేట మునిగామనీ అంటున్నారట. ఆ పార్టీలాగే తమ జీవితాలు కూడా అలాగే ఛిన్నాభిన్నమై పోయిందనీ వీరంతా గుర్రుగా ఉన్నారట. దీంతో టీడీపీ, జనసేనకు జై కొడుతున్నారటమరీ ముఖ్యంగా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాల్టీల్లో అయితే అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారంటే ఫ్యాను పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. బొబ్బిలి మున్సిపాల్టీలో ఇప్పటికే ఒక తిరుగుబాటు మొదలైందట. అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఆలస్యమట.స్వయంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఫోన్ చేసి బుజ్జగించినా కుదరదని తెగేసి చెబుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. గతంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరాలంటే ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకులతో రాయబారం నడిపించాలి. అదే ఇప్పుడు ఇందుకు రివర్స్ లో ఉందట వ్యవహారం. ఎవరూ ఏమీ అడక్కుండానే.. మేమే వచ్చేస్తున్నాం.. వద్దనకండి ప్లీజ్ అంటూ సైకిల్ బెల్ వారంతట వారే మోగిస్తున్నారట. చోటా మోటా నాయక గణం తమంత తాముగా వెళ్లి.. కూటమి పార్టీల కండువాలు కప్పేసుకుంటున్నారట.ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే వైసీపీని ఎప్పుడు ఖాళీ చేద్దామా? అన్నట్టుందట ఇక్కడి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి జోరు. వారానికి కనీసం రెండు మూడు గ్రామాల వైసీపీ కార్యకర్తలను తమ గ్లాసు పార్టీలో చేర్పించందే నిద్రపోవడం లేదట ఎమ్మెల్యే మాధవి. భవిష్యత్తులో తమకు పదవులు వచ్చినా రాకపోయినా.. వైసీపీ అనేది ఉండకూడదు. ఎటు నుంచి ఎటు చూసినా జనసేన మాత్రమే కనిపించాలన్నంత కసితో పని చేస్తున్నారట ఈ మహిళా ఎమ్మెల్యే.జిల్లా కేంద్రంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందంటున్నారు. కోరి వస్తామన్నా చేద్దాం- చూద్దాం అంటూ దాట వేస్తున్నారట ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు. వైసీపీలో అవినీతి మరక అంటని వారిని మాత్రమే తీసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వస్తామనీ.. కార్పొరేషన్ను టీడీపీ పరం చేస్తామని బంపరాఫర్లు ప్రకటిస్తున్నా.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వద్దంటే వద్దంటున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే.. వారే పరిపాలించాలని హితబోధ చేస్తున్నారట. అందులోనూ ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టం తమకేనని.. వారిస్తున్నారట. దీంతో తండ్రి మాట జవదాటలేక మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకూ వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారటు ఎమ్మెల్యే.ఇక ఎస్ కోట, చీపురుపల్లి, సాలూరు, గజపతినగరం, కురుపాం నియోజకవర్గాలలో చేరికల పరంపర ఒక రేంజిలో కొనసాగుతోందట. రోజుకో నియోజకవర్గంలో భారీ స్థాయిలో చేరికలు కనిపిస్తున్నాయట. గ్రామాలకు గ్రామాలు సైకిల్ కి సై అంటున్నాయట. దీంతో వైసీపీ లీడర్లు బయటకు రావడానికే తటపటాయించాల్సి వస్తోందట. పార్టీ ఖాళీ అవుతుంటే ఇటు చూస్తూ ఊరుకోలేక, అటు అధినేతకు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారట. ఏది ఏమైనా.. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చే నాటికి ఈ ప్రాంతాల్లో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయట.

Related Posts