YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఎక్స్ ను అమ్మేసిన మస్క్...

ఎక్స్ ను అమ్మేసిన మస్క్...

న్యూయార్క్, ఏప్రిల్ 1, 
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను అమ్మేశారు. తను ఇటీవలే స్థాపించిన కృతిమమేధ అంకుర సంస్థ ఎక్స్ ఏఐకి 33 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 2.80 లక్షల కోట్లు)కు విక్రయించినట్లు పేర్కొన్నారు. 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. దానిని ఎక్స్‌గా పేరు మార్చారు.అప్పుడు 44 బిలియన్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు 33 బిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్మేశారు. ఎక్స్‌ను కూడా సొంతం చేసుకోవడంతో ఎక్స్‌ఏఐ తాజా విలువ 80 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని మస్క్ ప్రకటించారు. ఈ అమ్మకం మొత్తం స్టాక్స్ రూపంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఎక్స్ విలువ 33 బిలియన్ అమెరికన్ డాలర్లు (45 బిలియన్ అమెరికన్ డాలర్లు+12 బిలియన్ అమెరికన్ డాలర్ల అప్పులు)గా అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్స్ ప్లాట్‌ఫాంకు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ‘ఎక్స్ ఏఐ, ఎక్స్‌ల భవిష్యత్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.ఈ రోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేసేందుకు ముందుడుగు వేస్తున్నాం. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసేలా సమర్థవంతమైన వేదికను నిర్మించేందుకు మాకు వీలు కల్పిస్తుంది’ అని మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రెండేండ్ల కింద స్థాపించిన కృతిమమేధ అంకురసంస్థ ఎక్స్ ఏఐ శరవేగంగా దూసుకుపోతోందని మస్క్ అభిప్రాయపడ్డారు. ‘కొద్ది కాలంలోనే ప్రపంచంలో ఎంతో సామర్థ్యం ఉన్న కంపెనీల జాబితాలోకి ఎక్స్ ఏఐ చేరింది. ఈ రెండింటి కలయిక వల్ల యూజర్లు మరింత మెరుగైన అనుభవం పొందనున్నారు.’ అని వివరించారు. ఎక్స్‌ఏఐ 2025 ఫిబ్రవరిలో ఏఐ చాట్‌బాట్ గ్రోక్ 3ని విడుదల చేసింది. చాట్‌జీపీటీ, డీప్ సీక్ వంటి రకరకాల ఏఐ టూల్స్‌కు ఇది పోటీనిస్తుందని అంతా భావిస్తున్నారు.

Related Posts