సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు దోషులకూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించే టిల్ డెత్ అన్న మాటను ఉపయోగించింది. అంటే దోషులు ముగ్గురూ జీవించి ఉన్నంత వరకూ జైలులోనే ఉండాలని తీర్పు ఇచ్చింది. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 79 మంది సాక్షులను, డిఫెన్స్ 30 మంది సాక్షులను ప్రశ్నించింది.
పదేళ్ల కిందట విజయవాడలో నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి బాయిలర్ లో వేసి దహనం చేసిన సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. నాగవైష్ణవి హత్య సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తండ్రి గుండె ఆగి చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 జనవరి 30న జరిగిన ఈ సంఘటనపై అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూస్తానని చెప్పారు. నాగ వైష్ణవి హత్య కేసులో నిందితులైన వెంకట్రావ్, మోర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీష్ కు రిమాండ్ లో ఉన్నారు.
ఆ రోజు విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి, కుమారుడు సాయితేజను స్కూల్ కు తీసుకుని డ్రైవర్ లక్ష్మణరావు వెల్తున్నాడు. ఉదయం ఎనిమిదన్నర గంటల సమయంలో బి.ఆర్.టి.ఎస్ రోడ్డులోకి కారు రాగానే మరోకారులో కొందరు దుండుగులు దిగారు. నాగవైష్ణవి ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని, డ్రైవర్ లక్ష్మణరావును హాత్యచేసి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసారు. లక్ష్మణరావును హాత్యచేస్తున్న టైమ్ లోనే నాగవైష్ణవి సోదరుడు కారులోంచి దిగిపారిపోయాడు. దుండుగులు ప్లాన్ ప్రకారం నాగవైష్ణవి చేతికి చిక్కడంతో బెజవాడ రోడ్లుపై దూసుకుపోయింది. కనకదుర్గ వారధి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది.
నాగవైష్ణవి కిడ్నాప్ నగర పోలీసులకు సవాల్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. బెజవాడ నగర నడిబొడ్డున, పట్టపగలే అందరూ చూస్తుండగా డ్రైవర్ ను హాత్యచేసి చిన్నారిని కిడ్నాప్ చేసారు. చిన్నారి వైష్ణవి కోసం పోలీసులు విసృతంగా గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. పలగాని ప్రభాకర్ కుటుంబసభ్యులను విచారించారు. మూడవ రోజు సాయంత్రం సమయంలో పోలీసులకు సమాచారం అందింది. గుంటూరు ఆటోనగర్ లోని ఒక కొలిమిలో చిన్నారికి సంబంధించిన ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. హూటాహుటీన అక్కడకు చేరుకున్న పోలీసులకు అక్కడ పరిస్ధితి చూసి చలించిపోయారు. చిన్నారి నాగవైష్ణవి ఆనవాళ్లు ఏమాత్రం లేదు అంతా బూడిదైపోయింది. కాని ఆ చిన్నారి చేతికున్న డైమండ్ రింగ్ ఆధారంగా ఆ ఇనుములు కాల్చే కొలిమిలో చిన్నారిని వేసారని మాత్రం నిర్దారించుకున్నారు. చిన్నారి ఇకలేదన్న వార్త తెలుసుకున్న నాగవైష్ణవి తండ్రి పలగాని ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. అతన్ని హూటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అల్లారుముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిన్నారి నాగవైష్ణవి చెంతకే చేరిపోయాడు. చిన్నారి హాత్య, ఆ సమాచారంతో మృతి చెందిన తండ్రి సంఘటన అందరిని కలిచివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులో దుండుగులను కఠినంగా శిక్షించాలని నిరసనలు పెల్లుబికిసాయి. అప్పటికే ప్రభాకర్ కుటుంబసభ్యులు ఇచ్చిన సమచారంతో కిడ్నాప్ కు ప్లాన్ చేసింది ఎవరు, డ్రైవర్ ను హత్య చేసింది ఎవరు, చిన్నారి నాగవైష్ణవిని కొలిమిలో పడేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అత్యంత దారుణమైన సంఘటనకు ప్లాన్ చేసింది పలగాని ప్రభాకర్ర బావమరిది పంది వెంకట్రావ్ గౌడ్ అని తేల్చారు. అతనితో పాటుగా ఈ సంఘటనలో పాత్రదారులైన మోర్ల శ్రీనివాస్, వెంపర్ల జగదీష్ లను పోలీసులు అరెస్టు చేసారు. కోర్డు రిమాండ్ విధించినా మళ్లీ పోలీసు కస్టడీకి తీసుకుని ఈ ముగ్గురిని విచారించగా సంఘటనకు సంబందించిన వివరాలు, అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
పలగాని ప్రభాకర రావు వివిధ వ్యాపారాలు చేస్తూ నగరంలో ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే అంగవైకల్యమున్న అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను వివాహాం చేసుకున్నాడు. కొన్నెళ్లకు నర్మదాదేవిని కూడా వివాహం చేసుకున్నాడు. కాలక్రమంలో పలగాని ప్రభాకర్ నర్మదాదేవితోనే ఉంటున్నాడు. మొదటి భార్య వెంకటేశ్వరమ్మను అతని కుమారుడు విషయాలలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై వెంకటేశ్వరమ్మ సోదరుడు పంది వెంకట్రావుగౌడ్ తరుచూ బావ పలగానితో వాగ్వివాదానికి దిగుతూ ఉండేవాడు. అయినా ప్రభాకర్ తీరులో మార్పురాకపోగా నర్మదా దేవికి పుట్టిన నాగవైష్ణవి, సాయితేజలపై ప్రేమాభిమానాలు చూపించేవాడు. ఆ ఫ్యామీలీపై ఉన్న ఆదరణ సొదరి వెంకటేశ్వరమ్మపై లేకపోవడంతో పంది వెంకట్రావ్ గౌడ్ స్నేహితులతో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసాడు. ఆ పిల్లలిద్దరనీ కిడ్నాప్ చేస్తే పలగాని దారిలోకి వస్తాడని ఆశించారు. కిడ్నాప్ కు ప్లాన్ చేసారు. కాని కథ అడ్డం తిరిగి ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది.
నాగవైష్ణవి హాత్యోదంతంతో ప్రభాకర్ కూడా మృతి చెందడంతో నగరంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపట్టారు. ఇంతటి కిరాతక చర్యకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని పెద్దఎత్తున నినదించారు. నాటి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా ప్రభాకర్ ఇంటికి వచ్చి అతని భార్య నర్మదాదేవిని, డ్రైవర్ లక్ష్మణరావు కుటుంబాన్ని పరామర్శించి పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరునెలలో కేసు విచారణ పూర్తైయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అప్పటినుంచి మనోవేదనతో ఉంటున్న నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. ఈ కేసులో ఎ-1గా మోర్ల శ్రీనివాసరావు, ఎ-2 గా యంపరాల జగదీష్, ఎ-3గా పలగాని ప్రభాకరరావు బావమరిది పంది వెంకటరావు గౌడ్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ 79మంది సాక్షులను, నిందుతుల తరపు న్యాయవాది 30మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు అనేకసార్లు బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్నన్యాయస్ధానం మాత్రం నిరాకరించింది. ఎనిమిదేళ్లుగా నిందితులు జైలులోనే ఉన్నారు.