YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రమాదమే... హత్య కాదంటున్న పోలీసులు

ప్రమాదమే... హత్య కాదంటున్న పోలీసులు

రాజమండ్రి, ఏప్రిల్ 2, 
తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పైన రావడంతో విజయవాడ వచ్చేసరికి నీరసంగా కనిపించారని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. ఆయన మీద వస్తున్న ఆరోపణలను ఎస్ ఐ సుబ్బారావు కొట్టిపారేశారు. ఎండకు దూర ప్రాంతం ప్రయాణించినందున వడదెబ్బ తగిలి ఉండవచ్చని, తాము విశ్రాంతి తీసుకోవాలని కోరినా వినలేదని చెప్పారు. నీరసంగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ ను ఎస్ఐ సుబ్బారావు గమనించి రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలోని పార్కులో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మూడు గంటల విశ్రాంతి తీసుకున్న తర్వాత టీ కూడా ప్రవీణ్ తాగారని చెబుతున్నారు. అక్కడే ఉన్న టీ కొట్టు యజమాని బుల్లెట్ బండికి హెడ్ లైట్ ఊడపోవడంతో దానిని తాడుతో కట్టేందుకు ప్రయత్నించారు. అయితే తాడుతో కడితే నిలబడదని భావించి ఇనుప చువ్వను తెచ్చేందుకు టీ కొట్టు యజమాని వెళ్లారు. ఎస్.ఐ సుబ్బారావు కూడా రాత్రికి ఇక్కడ లాడ్జిలో విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం బైక్ పై వెళ్లవచ్చని పాస్టర్ ప్రవీణ్ ను కోరారు. హెడ్ లైట్ లేకుండా జాతీయ రహదారిపై రాజమండ్రి వరకూ ప్రయాణించడం కష్టమని కూడా సుబ్బారావు ప్రవీణ్ కు సూచించారు. అన్నింటికీ కూల్ గా నే సమాధానమిచ్చిన పాస్టర్ ప్రవీణ్ తలాడించడంతో ఎస్ ఐ సుబ్బారావు తాత్కాలికంగా రిపేర్ చేయించుకుని వెళ్లాలని కూడా సూచించారని చెబుతున్నారు... కానీ టీ కొట్టు యజమాని, ఎస్ఐ సుబ్బారావులు పక్కకు వెళ్లడంతో పాస్టర్ ప్రవీణ్ వినకుండా రాజమండ్రికి వేగంగా బయలుదేరి వెళ్లారు. తనకు రాజమండ్రిలో అత్యవసర పని ఉండటంతోనే పాస్టర్ ప్రవీణ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయన పాలిట మృత్యువుగా మారింది. ఒకవైపు నీరసం, మరొకవైపు వడదెబ్బ వెరసి కలసి పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరొక వైపు పాస్టర్ ప్రవీణ్ ది హత్యగా ఆరోపిస్తున్న వారు తమ వద్ద ఆధారాలుంటే సమర్పించాలని,వాటి ప్రకారం చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతెలిపారు. దాదాపు రెండు వందల సీసీ కెమెరాలను పరిశీలించడం, ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత అలసటతో బయలుదేరిన ప్రవీణ్ మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Posts