YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యోగి వర్సెస్ స్టాలిన్...

యోగి వర్సెస్ స్టాలిన్...

లక్నో, ఏప్రిల్ 2, 
జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు సృష్టిస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇలా చేయడం వల్ల రాష్ట్రం చిన్నదైపోతుందా?‘ అని ప్రశ్నిస్తూ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్టాలిన్‌ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇది యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు.యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ‘యూపీలో తమిళం బోధించే ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారు? తమిళం నేర్చుకునేందుకు ఎంత మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు?‘ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. తమిళనాడు విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకోవాలని, హిందీని బలవంతంగా రుద్దే ఆలోచనను విరమించాలని ఆయన డిమాండ్‌ చేశారు.త్రిభాషా విధానంపై యోగి, స్టాలిన్‌ మధ్య ఇటీవల మాటల యుద్ధం తీవ్రమైంది. స్టాలిన్‌ ఓటు బ్యాంకు భయంతోనే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శించగా, స్టాలిన్‌ దీనిని ‘పొలిటికల్‌ డార్క్‌ కామెడీ‘గా అభివర్ణించి ఎద్దేవా చేశారు. NEP–2020లోని త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి, అందులో రెండు జాతీయ భాషలు ఉండాలని కేంద్రం చెబుతోంది. అయితే, హిందీని బలవంతంగా రుద్దడానికే ఈ విధానం తెచ్చారని తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాషా విధానం రాజకీయ, సాంస్కృతిక సున్నితత్వాలను తాకుతుండటంతో, ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కీలకంగా మారింది. త్రిభాషా విధానం విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందా లేక భాషా వివాదాలను మరింత రెచ్చగొడుతుందా అనేది చూడాల్సి ఉంది.

Related Posts