
విజయవాడ, ఏప్రిల్ 3,
అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల్ని, స్థానిక నేతల్ని పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దానికి ఆయన ప్రవర్తనే ప్రత్యక్ష సాక్ష్యం. లోకల్ లీడర్స్ తో పెద్దగా కలిసేవారు కాదు జగన్, ఆ మాటకొస్తే మంత్రులకు కూడా అపాయింట్ మెంట్లు దక్కేవి కావు, ఇక ఎమ్మెల్యేల సంగతి సరేసరి. జగన్ అపాయింట్ మెంట్ దొరకాలంటే ఎమ్మెల్యేలు రోజుల తరబడి తాడేపల్లి ప్యాలెస్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయాక పరిస్థితిలో మెల్ల మెల్లగా మార్పులొస్తున్నాయి. జగన్ కోటరీ ఒక్కొక్కరే దూరం జరిగారు. అధికారంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్నవారు కూడా సైలెంట్ అయ్యారు. చివరకు మిగిలింది కార్యకర్తలు, స్థానిక నాయకులే. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీకి లాయల్ గా ఉన్నవారు వైసీపీ పరువు కాపాడారు. అందుకే వారికి రేపు తాడేపల్లిలో ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చారు జగన్.రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని తప్పించుకుంది. గతంలో ఆయా సీట్లన్నీ వైసీపీకి చెందినవే. అయితే వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, వైసీపీకి కాస్త అనుకూలంగా ఫలితాలొచ్చాయి. దీంతో జగన్ కి తత్వం బోధపడింది. తాను ఇన్నాళ్లూ దూరం పెట్టిన కార్యకర్తలు, స్థానిక నేతలే తనను వదిలిపెట్టలేదని అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ కోటరీగా తిరిగిన వాళ్లు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు తీసుకున్నవారు అడ్రస్ లేకుండా పోయారనే విషయం స్పష్టమైంది. దీంతో జగన్ లో మార్పు మొదలైంది. కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ ఆమధ్య ట్వీట్ వేసిన ఆయన, తాజాగా స్థానిక నాయకులతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను స్వయంగా కలుస్తానని కబురు పంపించారు జగన్. వారందర్నీ తాడేపల్లికి పిలిపిస్తున్నారు.వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లోని వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు హాజరవుతారు. వీరందరికీ జగన్ ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారట. అందరితో మాట్లాడి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటారట.
ఈ మార్పు సరిపోదు జగనూ..
జగన్ లో మార్పు మొదలవడం మంచిదే, కానీ ఈ మార్పు సరిపోదు. అప్పట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని పొరుగు రాష్ట్రం నేతలంటూ ఎగతాళి చేసిన జగన్.. అధికారం పోయాక తాను బెంగళూరులో ఎందుకు తలదాచుకుంటున్నారో చెప్పాల్సి ఉంది. కానీ జగన్ ఇప్లిపుడు అసలైన పొటికల్ టూరిస్ట్ లా మారిపోయారని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఎప్పుడో ఎక్కడో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే మాత్రం పరామర్శలకు వస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. కానీ ఈసారి లోకల్ లీడర్స్ కోసం బెంగళూరు నుంచి జగన్ వస్తున్నారు. ఇది మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఈ మార్పు సరిపోదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కళ్లకు గంతలు కట్టి ఆడించింది కోటరీయేనని ఆ పార్టీ నేతలు కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ గంతలు ఆయన విప్పుకోవాలి. ప్రజల మధ్యకు వచ్చినప్పుడే ఏదైనా ఫలితం ఉంటుంది. అది కూడా కూటమి చేసే తప్పుల్ని బట్టే ప్రజలు జగన్ దగ్గరకు చేరతారనే విషయాన్ని మరింతగా అర్థం చేసుకోవాలి. పాలనలో కూటమి సక్సెస్ అయితే నాలుగేళ్ల తర్వాత కూడా ప్రజలకు జగన్ అవసరం ఉండదు.