
విజయవాడ, ఏప్రిల్ 3,
విజయవాడలో దేవాదాయ శాఖ భూములతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరెకరాల భూమి అన్యాక్రాంతమైనా… దేవాదాయ శాఖ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇవే భూములకు నకిలీ పత్రాలను సృష్టించి వందల కోట్లకు బ్యాంకుల్ని మోసం చేశారు. దేవాదాయ శాఖకు దానపత్రం రాసిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడం వెనుక దేవాదాయ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.విజయవాడ పటమటలో ఉన్న గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్ట్ భూములు ఉన్నాయి. భూముల్ని దానం ఇచ్చిన దాతల కుటుంబానికి చెందిన మూడో తరం వారసులు భూముల విలువ పెరగడంతో అవి కుటుంబ ఆస్తులంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఆ భూముల్ని అమ్ముకోడానికి అనుమతివ్వాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో భూములను దానం ఇచ్చిన సమయంలోనే వాటిని ధర్మకార్యక్రమాలలో దేనికి వినియోగించాలో స్పష్టం చేస్తూ రాసిన దాన పత్రం వెలుగు చూసింది. నగరం మధ్యలో ఉన్న వందల కోట్ల ఖరీదు చేసే ఈ భూమిని కాజేయడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో దేవాదాయ శాఖకు సారథ్యం వహించిన మంత్రి అండతో భూముల్ని అమ్మేసే స్కెచ్ వేశారు. అంతకు ముందే ఇవే భూములపై ఓ జాతీయ బ్యాంకులో రుణాన్ని కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గోవిందరాజులు ఈనాం ట్రస్ట్ భూముల వ్యవహారంపై 2023లో మచిలీపట్నం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో బి.సుబ్బారావు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక వెలుగు చూసింది.పబ్లిక్ ట్రస్ట్‌కు సంబంధించిన భూమిని ప్రైవేట్ ట్రస్టుగా భావిస్తూ ట్రస్టీ ఎప్పుడూ భూమికి యజమాని కాలేడని గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు స్పష్టం చేశాయని, ఆ తీర్పులకు విరుద్దంగా కింది కోర్టులు ఇచ్చిన డిక్రీలను అడ్డం పెట్టుకుని భూముల్ని అమ్మే ప్రయత్నాలు చేయడంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ట్రస్టు నిర్వహిస్తోన్న ట్రస్టీ దేవాదాయ చట్టం సెక్షన్ 30/87 ప్రకారం ఆస్తులను కాపాడలేకపోవడంతో చర్యలు తీసుకోవడంతో పాటు వారిని ట్రస్ట్ కార్యక్రమాల నుంచి తొలగించి వేరేవారిని నియమించడంతో పాటు ట్రస్ట్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేశారు.విజయవాడ నగరంలో ఉన్న దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కావడంపై హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల విజయవాడ కనకదుర్గ దేవస్థానం భూముల్ని 50 ఏళ్లకు లీజుకిచ్చే అంశం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే విజయవాడలో వందల కోట్ల దేవాదాయ శాఖ ఆస్తులు పరాధీనమైన వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేవాదాయ భూములను కాపాడాలని పోరాడుతున్న వారు వీటిని వెలుగులోకి తెస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో ఖరీదైన భూముల వ్యవహారంలో ఉదాసీనత బయటపడింది. సామాజిక, దైవిక కార్యక్రమాలకు చెందిన భూములను కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పటమటలో ఉన్న గోవిందరాజు ట్రస్టు ఈనాం భూముల్ని చూపి జాతీయ బ్యాంకులో రూ.100కోట్ల రుణం తీసుకోవడం గతంలోనే వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన జాతీయ బ్యాంకు మరో బ్యాంకులో విలీనమైన తర్వాత ఈ వ్యవహారం పూర్తిగా మరుగున పడిపోయింది. అసలు వడ్డీలతో కలిపి ఈ మోసం విలువ రూ.200కోట్లు వరకు ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.గోవిందరాజు వంశానికి చెందిన వారు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన పటమటలోని సర్వే నెంబర్ 91/2లోని 5,92 ఎకరాల స్థలాన్ని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టుకు దానం చేశారు. రిజిస్టర్డ్ డీడ్ ప్రకారం భూమిని జాగ్రత్తగా కాపాడాలని, ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు బాగాలు చేసి ధార్మిక కార్యక్రమాలకు వాడాలని, ఏ భాగం ఎందుకు వాడాలో కూడా దాన పత్రంలో స్పష్టం చేశారు.గోవింద రాజులు ట్రస్టుకు సంబంధించిన భూముల్ని లీజుకు తీసుకున్న వారి వారసుడు పదేళ్ల క్రితమే ఈ భూముల్ని తనఖా పెట్టి రూ.100కోట్ల రుణాన్ని తీసుకుని వాటిని చెల్లించలేదు.వడ్డీలతో కలిపి రుణమొత్తం భారీగా పెరిగింది. ఈ క్రమంలో గోవింద రాజు ట్రస్టును శ్రీ గోవింద రాజు ట్రస్టు పేరుతో దేవాదాయ శాఖను ప్రతివాదిగా చేర్చకుండా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి విజయవాడకు చెందిన ఓ పార్టీ ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ మంత్రి ఒకరు సహకరించినట్టు తెలుస్తోంది.అసలైన ట్రస్టీలు ఉన్న సమయంలోనే ఆ భూముల్లో కొంత భాగాన్ని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించడంతో అక్కడ దశాబ్దాలుగా హైస్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ నిర్వహిస్తున్నభూమిని కార్పొరేషన్‌కు గతంలోనే రిజిస్ట్రేషన్ చేశారు. 5.90 ఎకరాల భూమి దేవాదాయ శాఖకు చెందినదేనని 2023లో నే విచారణాధికారి నివేదిక సమర్పించినా నాటి ప్రభుత్వం దానిని అమోదించకుండా తొక్కి పెట్టింది.భూమి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటే అసలు దొంగలు బయటపడతారు. దీంతో నివేదిక వెలుగు చూడకుండా విజయవాడకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ప్రజాప్రతినిధులు, అధికారులకు చిక్కులు తప్పవని హిందూ ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.