
తిరుపతి, ఏప్రిల్ 3,
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్లకు కొత్త ప్రక్రియను తీసుకొచ్చింది. ఇది భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మేవారు, కొనుగోలు చేసేవారు ఇబ్బందులకు పరిష్కారం కానుంది. రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ అనే కొత్త ప్రక్రియను అమలు చేస్తేంది. ఏప్రిల్ 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే సమయం కూడా ఆదా అవుతోంది. మరి ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట గంటల తరబడి వేచి ఉండనవసరం లేదు. భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వివాహ ఇతరత్రా అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ వ్యవస్థ అమలు కాబోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుకోవాలనుకునేవారు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే, ఆ తేదీనే, ఆ సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల అలాగే కొనుగోలుదారుల, అమ్మకందారులు నచ్చిన తేదీని, నచ్చిన సమయాన్ని ఎంచుకుని తమ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు వచ్చింది. దీనివల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయనవసరం లేదు.ఇప్పటికే ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం అయ్యాక ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్లాట్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. గంటకు ఆరుగురి చొప్పున స్టాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. దీన్నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది.స్లాట్ బుకింగ్ విధానాన్ని ఎక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. జిల్లాల్లో ఎక్కువ రద్దీ ఉండే రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐజీఆర్ఎస్‌లో పబ్లిక్ డేటా ఎంట్రీలో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ద్వారా ఇంటి వద్ద నుంచే తమకు నచ్చిన తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. అందుకోసం ముందు రోజుసాయంత్రం 5 గంటల లోపు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ సౌకర్యం మొదట జిల్లా ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటుంది. డిమాండ్ ఆధారంగా ఆ సేవలను మండలాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తారు. కాకపోతే సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ కోసం ఫీజు స్లాట్ బుకింగ్ ఫీజు రూ.5,000 ఉంటుంది.ప్రభుత్వ పని దినాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉచితంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే స్లాట్ బుక్ చేసుకున్న తరువాత, దాన్ని రద్దు చేసుకుంటే మాత్రం రూ.100 రుసుము వసూలు చేస్తారు. అపాయింట్‌మెంట్ (స్లాట్ బుకింగ్) సమయాన్ని మార్చాల్సిన సందర్భంలో రూ.200 రీషెడ్యూలింగ్ రుసుము వసూలు చేస్తారు. అపాయింట్‌మెంట్ సజావుగా జరిగేలా చూసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్‌కు కనీసం ఒక రోజు ముందు అవసరమైన రుసుమును చెల్లించాలి. అయితే ఈ విధానం అమలను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎం.హరినారాయణ పర్యవేక్షిస్తారు.రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌లు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ https://registration.ap.gov.in/igrs లోకి వెళ్లాలి. అందులోని ఆన్‌లైన్ సర్వీస్‌లో డాక్యుమెంట్ ఎంట్రీ అండ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పేరును నమోదు చేయాలి. ఆ తరువాత ఓటీపీ కోసం ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. అప్పుడు సెండ్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయాలి. ఓటీపీ మన ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.ఇప్పుడు మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం మళ్లీ ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. అందులో పబ్లిక్ డేటా ఎంట్రీ ఆప్షన్‌న్‌ను క్లిక్ చేయాలి. అందులో బుక్ స్లాట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు, మనకు నచ్చిన సమయం నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు.వివరాలను సమర్పించిన తరువాత, ఒక అప్లికేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. ఇది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి పని చేస్తోంది. ఆ తరువాత వారు ఏ రిజిస్ట్రేషనో ఎంచుకోవల్సి ఉంటుంది. ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేకమైన డిజిటల్ టోకెన్ మనకు కేటాయించబడుతుంది. ప్రతి టోకెన్ ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో లింక్ చేసి ఉంటుంది. ఇది సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయిస్తారు.