
విజయవాడ, ఏప్రిల్ 3,
ఏపీలో ( రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతూ వచ్చారు. పార్టీలో నెంబర్ 2 స్థాయి కలిగిన నేతలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. గత ఐదేళ్లపాటు పదవులతో పాటు ఆ పార్టీలో గౌరవం పొందిన నేతలు సైతం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులను వదులుకున్నారు. విజయసాయిరెడ్డి లాంటి నేత వైసిపికి గుడ్ బై చెప్పడం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణ పై సైతం అనుమానపు చూపులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.వాస్తవానికి బొత్స సత్యనారాయణ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగా బొత్స పవన్ కళ్యాణ్ ను ఎక్కడ కలిసిన ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భిన్నంగా బొత్స వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణాల్లో ఎదురుపడినప్పుడు ఆప్యాయ పలకరింతలు, ఆ లింగనాలు చేసుకుంటున్నారు. దీంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సైతం బొత్స విషయంలో పార్టీ శ్రేణులకు చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. బొత్సను పార్టీలోకి తెస్తే ఎలా ఉంటుంది అని పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించినట్లు సమాచారం. అయితే జనసేన నాయకుల నుంచి సానుకూలత రావడంతో పవన్ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అనేక కేసులు నమోదవుతున్నాయి. కొందరు అరెస్టులు కూడా అయ్యారు. కానీ బొత్స విషయంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు బొత్స. కానీ ఎన్నడు రివేంజ్ రాజకీయాలు నడపలేదన్నది ఆయనపై ఉన్న మంచి ముద్ర. అందుకే కూటమి ప్రభుత్వంలో సైతం ఆయనకు సరైన గౌరవం దక్కుతోంది.ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ శాసనమండలిపక్ష నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. అటువంటి నేతను జనసేనలోకి తెచ్చుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీయవచ్చని పవన్ భావిస్తున్నారట. ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు బొత్స. విజయనగరం జిల్లాలో అయితే నాలుగు నియోజకవర్గాలు ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉంటాయి. మిగతా నియోజకవర్గంలో సైతం ప్రభావం చూపగలరు. ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గంలో పట్టున్న నేత. అందుకే ఆయనను జనసేనలోకి రప్పించుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని పవన్ భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.