
హైదరాబాద్, ఏప్రిల్ 4,
కంచ గచ్చిబౌలి భూముల వివాదం కోర్టులు, ప్రతిపక్షాలు చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. వివాద పరిష్కారానికి మార్గం కనుక్కునేందుకు వ్యూహరచన చేస్తోంది. అందుకే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఆందోళనకారులతో చర్చలు జరపనుంది. రోజు రోజుకు మరింత వివాదాస్పదమవుతున్న 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళ వ్యక్తం చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు, ప్రజాసంఘాలతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉదయం నుంచి గచ్చిబౌలి భూ వివాదంలో చాలా పరిణామాలు జరిగాయి. ఓవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే... మరో వైపు కోర్టులు వెంటాడాయి. హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం తీరు, అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఉదయం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పాట్‌కు వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకొని మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. మధ్యాహ్నం 3.30కల్లా పూర్తి వివరాలు అందజేయాలని సూచించింది. ఈ నివేదిక అందిన వెంటనే విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు. ఇందులో సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చింది కోర్టు. అభ్యంతరాలు ఉన్నప్పుడు అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ప్రశ్నలపై అఫిడవిట్ దాఖలు చేయాలని విచారణను 16కు వాయిదా వేసింది. ఇది చాలా సీరియస్ అంశంగా చెప్పిన సుప్రీంకోర్టు వచ్చే వాయిదా వరకు పనులు పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో కూడా విచారణ సాగింది. ఇప్పటికే పనులు నిలిపివేయాలని ఆదేశించిన కోర్టుదాన్ని పొడిగించింది. విచారణ ఏడుకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థుల సంబరాలు
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులో వచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు. న్యాయస్థానాల కామెంట్స్‌తోనైనా రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బీఆర్‌ఎస్ కూడా హర్షం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం పడిందని కేటీఆర్, హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. ఇది విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ఈ ఉద్యానికి మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు
ఏఐ అడవులపై సోషల్ మీడియాలో సెటైర్లు
అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి అని.. దానిని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తారా అని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంటే.. లేదు లేదు ఆ భూములు చదును చేసి అభివృద్ధి చేసి.. 50 వేల కోట్ల ఆదాయం వచ్చేలాగా చేస్తామని అధికార కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే ఈ వివాదం న్యాయస్థానాల దాకా వెళ్ళింది. గౌరవ తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఈ వివాదంపై తీర్పును రిజర్వ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో పడగొట్టిన చెట్లను పరిశీలించాలని.. తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూమి చదును చేసే పనులు ఆగిపోయాయి. ఈ భూములకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ 400 ఎకరాల భూములను ఎవరు కొనుగోలు చేసినా.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారానికి దిగారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నానా యాగీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో డైనోసార్లు, ఏనుగులు, జింకలు, సింహాలు ఉన్నట్టు.. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కలు అవి అడవిగా మారినట్టు.. అందువల్లే హైటెక్ సిటీ ప్రాంతంలో అరుదైన జంతువులు జీవిస్తున్నట్టు.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఓ ఫోటోను రూపొందించారు. “కెసిఆర్ హయాంలో హైటెక్ సిటీలో అడవి ఏర్పడింది. ఆ అడవిలోనే జంతువులు మొత్తం జీవిస్తున్నాయి. 10 సంవత్సరాల కాలంలో విపరీతంగా మొక్కలు నాటారు కాబట్టి హైటెక్ సిటీ ప్రాంతం మొత్తం అడవిగా మారిపోయిందని” కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు కూడా బలం పెంచుకున్నారు. సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి నాయకులకు దీటుగా బదులిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆకస్మాత్తుగా ఇలాంటి ఆర్టిఫిషియల్ యుద్ధానికి దిగడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి నాయకులు డిఫెన్స్ లో పడ్డారు. అయితే వారు తదుపరి అడుగులు ఎలా వేస్తారో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇమేజ్ లో కారు ఫోటోను కూడా జత చేయడం విశేషం.